నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. గెలిచి నిలిచేది ఎవరు?

Wait 5 sec.

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతోన్న పశ్చిమ్ బెంగాల్ సహా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయనేదీ కొద్ది గంటల్లో తేలిపోనుంది. పశ్చిమ్ బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్‌‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనధికారిక వ్యక్తులు రాకుండా ఈసారి క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడీ కార్డుల విధానాన్ని ఈసీ ప్రవేశపెట్టింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో గెలుపు తమదేననే ధీమాలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో మిఠాయిలు సిద్ధం చేసుకుంటున్నాయి. బెంగాల్‌లో మోదీశ్రీ (కాషాయ రంగు), జొయ్‌ బంగ్లా (టీఎంసీ చిహ్నంలో ఒకటైన ఆకుపచ్చ రంగుతో), రసగుల్లా, రాజ్‌భోగ్‌లను వివిధ రంగుల్లో సిద్ధం చేసినట్లు మిఠాయి షాపుల యజమానులు చెప్పారు. తెల్లని రసగుల్లాలు ముందు సిద్ధం చేస్తున్నామని, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి తగిన రంగులో ముంచి వాటిని అందజేస్తామని చెబుతున్నారు. కేరళలో వేలాది మందికి బిర్యానీ తయారు చేస్తున్నారు. కొచ్చిలో సంబరాలకు సన్నద్ధమవుతోన్న బీజేపీ.. లడ్డూలను ఆర్డర్‌ చేశారు.ఇక, అత్యంత ఉత్కంఠ రేపుతోన్న పశ్చిమ బెంగాల్‌లో ఫల్తా మినహా మొత్తం 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు 77 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసినా ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో లెక్కింపు కేంద్రాలను తగ్గించారు. ముందుగా 87 ఏర్పాటుచేసి.. 10 కేంద్రాలను తగ్గించి, అనూహ్య రీతిలో భద్రతా బలగాలను అక్కడ మోహరించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారంటూ మమతా బెనర్జీ సహా టీఎంసీ అగ్రనేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం 165 మంది అదనపు మైక్రో అబ్జర్వర్లను, 77 మంది పోలీసు అబ్జర్వర్లను నియమించింది. మమతా బెనర్జీ పోటీచేసిన భవానీపుర్‌‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ, టీఎంసీ శ్రేణులు ఘర్షణపడ్డాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ నేత నివాసంపై కాల్పులు జరిపారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ తర్వాత అత్యంత ఆసక్తి రేపుతోన్న తమిళనాడులో అధికారాన్ని డీఎంకే నిలబెట్టుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నటుడు విజయ్‌ జోసెఫ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్పడంతో తమిళనాట తీర్పు ఆసక్తికరంగా మారింది. మొత్తం 38 జిల్లాల్లో 62 చోట్ల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో 234 రూమ్‌లలో ఈవీఎంలు, మరో 240 గదుల్ని పోస్టల్‌ ఓట్ల లెక్కింపు కోసం సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం దేశంలో వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్) చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళంలో పదేళ్ల తర్వాత అధికారం మారబోతుందని ‘హస్త’గతం అవుతుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. ఇదే నిజమైతే 1960 తర్వాత ఏ రాష్ట్రంలోనూ వామపక్షాలు అధికారం లేని పరిస్థితి తొలిసారి ఏర్పడనుంది. కేరళంలోనూ విస్తరణపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. పూంజర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన బీజేపీ నేత పీసీ జార్జి తన విజయంపై ఎవరికైనా సందేహం ఉంటే రూ.కోటి పందెం కాయడానికి ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. కేరళలో మొత్తం 79.70 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక, అసోంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొడతామని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 126 స్థానాలున్న ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగాయి. ఇక, 30 స్థానాలున్న పుదుచ్చేరిలోనూ ఓట్ల లెక్కింపు నేడు చేపట్టనున్నారు. ఇక్కడ మళ్లీ ఎన్డీయే కూటమి గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వీటితో పాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఉప- ఎన్నిక జరిగిన 8 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు సోమవారమే చేపట్టనున్నారు.