పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు.. కలెక్టర్ కీలక నిర్ణయం, 15 రోజులు డెడ్‌లైన్

Wait 5 sec.

ఇటీవల సుప్రీం కోర్టు మతమార్పిడి అంశంపై ఇచ్చిన తీర్పుతో బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌ (కుల ధ్రువీకరణ పత్రం) రద్దు అంశం తెరపైకి వచ్చింది. ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దుపై జేసీ భావన నేతృత్వంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ విచారణ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయాలని స్క్రూట్నీ కమిటీ బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు సిఫార్సు చేస్తూ నివేదికను అందజేసింది. పాస్టర్ ఆనంద్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని.. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని కమిటీ పేర్కొంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌‌కు అర్హుడు కాదని కమిటీ నివేదికను అందజేసింది. జేసీ భావన నేతృత్వంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ నివేదిక ఆధారంగా ఆనంద్‌కు నోటీసులు ఇచ్చారు. 'మీ ఎస్సీ సర్టిఫికెట్‌ను ఎందుకు రద్దు చేయకూడదో 15 రోజుల్లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి' అంటూ కలెక్టర్ వినోద్ కుమార్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వొచ్చని తెలిపారు. ఈ నెల 19న కలెక్టరేట్‌లో తుది విచారణ జరగనుంది.. ఆ తర్వాత ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుపై రాజ్యాంగ నిబంధనలు, ఆధారాలను బట్టి కలెక్టర్‌ ఫైనల్‌గా ఓ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత క్రైస్తవమతంలోకి మారిన చేయాలని పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన అక్కల రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే ఆయన ఆనంద్ సర్టిఫికెట్ రద్దు చేయాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలోనే జేసీ నేతృత్వంలో స్క్రూట్నీ కమిటీని ఏర్పాటు చేశారు. గత నెల 16న మొదటి విచారణ నిర్వహించగా పాస్టర్ హాజరుకాలేదు. ఈ నెల 1న రెండోసారి విచారణ నిర్వహించగా.. స్క్రూట్నీ కమిటీ ఎదుట రామిరెడ్డి, ఆనంద్‌‌లు హాజరై వారి వాదనలు వినిపించి అవసరమైన పత్రాలు కూడా అందజేశారు.2021లో బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంలో ఓ చర్చి నిర్మాణంపై వివాదం రేగింది. పాస్టర్ చింతాడ ఆనంద్‌ కొత్తపాలెంకు చెందిన రామిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామిరెడ్డితో పాటూ పలువురు తనను కులం పేరుతో దూషించి, దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు ముందు స్థానిక కోర్టు ఆ తర్వాత హైకోర్టు.. అక్కడి నుంచి సుప్రీం కోర్టుకు చేరింది. ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారి మత బోధనలు చేస్తున్నారని.. అలాంటప్పుడు ఆయనకు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుందని రామిరెడ్డి వాదనలు వినిపించారు. అయితే సుప్రీం కోర్టు మతమార్పిడి అంశంపై కీలక తీర్పు ఇచ్చింది. మతం మారిన వారికి ఎస్సీ హోదా కోల్పోతారని చెబుతూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ క్రమంలో రామిరెడ్డి పాస్టర్ ఆనంద్ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న ఆనంద్ కుల ధ్రువీకరణ పత్రంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.