'మా మధ్య విభేదాలు లేవు.. కానీ ఆ చిన్న వివాదం కారణంగానే'.. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే క్లారిటీ

Wait 5 sec.

ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య అప్పుడప్పుడు చిన్న, చిన్న వివాదాలు తెరపైకి వస్తున్నాయి.. వెంటనే సమసిపోతున్నాయి. కానీ చిత్తూరులో టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య వివాదం ముదిరి ఎమ్మెల్యే తన గన్‌మెన్‌లను సరెండర్ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ వివాదంపై ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి క్లారిటీ ఇచ్చారు.. అసలు ఏం జరిగిందో వివరించారు.చిత్తూరులో చిన్నపాటి వివాదం దాడిగా ప్రచారం జరిగినట్లు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్‌మోహన్ తెలిపారు. డ్వాక్రా సంఘంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చిన్న వివాదమని..కానీ తమ ఇద్దరి మధ్య వివాదం అంటూ దుష్ప్రచారం చేశారన్నారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని.. ఇద్దరం కలిసి చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. గత రెండేళ్లలో తాము అధికారుల బదిలీలు కానీ, ఇతర అంశాల్లో కానీ ఎంటర్ కాలేదన్నారు. చిత్తూరు కార్పొరేషన్‌‌ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల విషయంలో జరిగిన మాటల వివాదాన్ని దాడిగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వివాదానికి సంబంధించి అందరితో మాట్లాడామన్నారు. అసలు తమ ప్రమేయం లేకుండా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వివాదం అంటూ కొంతమంది ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో తాము అధికారుల్ని, నేతల్ని సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. తాము నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు. చిత్తూరు కార్పొరేషన్‌లో రీసోర్స్ పర్సన్ (ఆర్పీ)తో కొంతమంది మహిళలకు వివాదం రేగింది. ఈ క్రమంలో కొంతమందిపై కేసులు నమోదైనట్లు వార్తలొచ్చాయి. ఈ వివాదం కాస్త ఎంపీ వర్సె ఎమ్మెల్యేగా మారిందని టాక్ వినిపించింది. ఈ క్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గుర‌జాల జ‌గ‌న్‌మోహ‌న్‌ ఎంపీ తీరుకు నిరసనగా.. ఈ నెల ఒక‌టో తేదీన తన గ‌న్‌మెన్లను సరెండర్ చేస్తూ వెనక్కు పంపినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వెంటనే ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి మీడియా సమావేశం నిర్వహించి ఇద్దరి మధ్య విభేదాలు లేవని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటీవల పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని.. వివాదాల జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కానీ ఇంతలోనే చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలంటూ ప్రచారం జరిగింది.. అయితే వారిద్దరు మాత్రం ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు.