ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లో ప్రతి కుటుంబానికి ప్రాపర్టీ కార్డులు జారీ చేయనుంది. నక్ష (నేషనల్‌ జియోస్పేషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్స్‌) ప్రాజెక్టు కింద మళ్లీ సర్వే చేసి ఇళ్లు, ఇతర ఆస్తులు, భూములకు ప్రాపర్టీ కార్డులు ఇస్తారు. వాస్తవానికి గతేడాది ఫిబ్రవరిలో ఈ సర్వే గడువు ముగిసింది. మళ్లీ ఈ సర్వేను ప్రారంభించి పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రాన్ని సంప్రదించి నక్ష సర్వేను తిరిగి ప్రారంభించనున్నారు. కేంద్రం గ్రామాల మాదిరిగానే నగరాలు, పట్టణాల్లో ప్రజల ఆస్తులను డ్రోన్లు, జీఐఎస్‌ టెక్నాలజీ ద్వారా సర్వేచేసి ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం 2024లో నక్ష ప్రాజెక్టుని మొత్తం 152 నగరాలు, పట్టణాల్లో ప్రారంభించింది. ఏపీలోని కాకినాడ, ఏలూరు, గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కుప్పం, అనంతపురంలో ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో సర్వే పూర్తి చేసిన తర్వాత రికార్డుల ఎంట్రీ, మ్యాపింగ్‌ మాత్రం చేపట్టలేదు. కానీ దేశంలో పలు రాష్ట్రాలు ప్రాపర్టీ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ క్రమంలో ఏపీలో కూడా 2027 మార్చిలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్రంలో ప్రజలకు పంపిణీ చేసే ఈ ప్రాపర్టీ కార్డుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తుల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఇళ్లు, భవనాలు, భూములు, స్థలాలు, విస్తీర్ణం వివరాలు కార్డులో ఉంటాయి. అలాగే ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందొచ్చు. అలాగే మున్సిపల్‌శాఖ అధికారులకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని.. సమగ్ర ప్రణాళికల్ని రూపొందించే కునే అవకాశం ఉంటుంది. అందుకే ఏపీ ప్రభుత్వం నక్ష సర్వే పనుల్ని పూర్తి చేయాలని భావిస్తోంది.. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.