'పశ్చిమ బెంగాల్‌లో ఎవరు గెలిచినా.. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు': ఈసీ

Wait 5 sec.

: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ కొనసాగుతుండగానే.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించకూడదని కఠిన ఆంక్షలు విధించింది. బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసకు తావు లేకుండా, శాంతి భద్రతలను పరిరక్షించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.విజయ యాత్రలకు ఈసీ నో..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి, ప్రత్యేక పరిశీలకులు సుబ్రతా గుప్తా ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. "అభ్యర్థుల గెలుపు తర్వాత రాష్ట్రంలో ఎక్కడా విజయ యాత్రలకు అనుమతి లేదు. విజయం సాధించిన అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి వీధుల్లోకి రాకూడదు" అని ఆయన మీడియాకు తెలిపారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫలితాల వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకే అదనపు బలగాలను కూడా మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా బెంగాల్‌లో ఫలితాల తర్వాత రాజకీయ ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముందస్తు చర్యలు చేపట్టారు.కౌంటింగ్ ఏజెంట్ల ఫిర్యాదులపై స్పందన..మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో పలు చోట్ల రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి. కొన్ని కేంద్రాలకు ఏజెంట్లు చేరుకోలేకపోతున్నారని, వారిని అడ్డుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై సుబ్రతా గుప్తా స్పందించారు. "ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారనే అంశం మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను మేము పరిశీలిస్తున్నాం. తక్షణమే దీన్ని పరిష్కరించి, అందరు ఏజెంట్లు తమ విధుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం" అని ఆయన హామీ ఇచ్చారు.కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపురాష్ట్రవ్యాప్తంగా వందలాది కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు కూడా పరిమిత సంఖ్యలో వ్యక్తులతో వచ్చి మాత్రమే ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, భారీ జన సమీకరణతో రావద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.