తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో నిధులు లేవని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిధుల కోసం చిప్ప చేతిలో పట్టుకుని ఢిల్లీకి పోయి కేంద్రమంత్రులను కలుస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి.. తిరిగి తెలంగాణకు వచ్చి మళ్లీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని మండిపడ్డారు. మరి అలాంటప్పుడు చిప్ప చేతిలో పట్టుకొని ఢిల్లీకి ఎందుకు పోతున్నారో సమాధానం చెప్పాలంటూ అధికార కాంగ్రెస్ నేతలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం చేశారని కొంత మంది విమర్శిస్తున్నారని.. మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత తెలంగాణలో ఇంకా ఎక్కువ వరి పంట పండుతోందని తేల్చి చెప్పారు. దేశంలోనే తెలంగాణ నుంచే కేంద్ర ప్రభుత్వం అత్యధిక ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.తెలంగాణకు కేంద్రం ఎలాంటి సహాయం చేయకపోతే మరి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంత విమర్శించినా తెలంగాణ ప్రజలకు బీజేపీ మేలు చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి బీజేపీపై విమర్శలు చేస్తే.. ఆయను తెలంగాణ ప్రజలు పదవి నుంచి దించేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి రూపాయి వెళ్తే.. తిరిగి రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం 30 పైసలు మాత్రమేనని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపైనా కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ జిల్లా ఎక్కువ పన్నులు చెల్లిస్తోందని.. మరి రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఆదాయం అంతా హైదరాబాద్‍కే ఖర్చు చేస్తున్నారా అని రేవంత్ రెడ్డి సర్కార్‌ను ప్రశ్నించారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేది కేంద్ర ప్రభుత్వం అని.. నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ కాదని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు నిధుల కేటాయిస్తుందని వెల్లడించారు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణకు పన్నుల్లో వాటా పెంచినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇక దేశంలోనే ఎక్కువ యూరియాను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నామని చెప్పిన విశ్వేశ్వర్ రెడ్డి.. యుద్ధ సంక్షోభం కారణంగా పెట్రోల్ ధరలు తప్పనిసరిగా పెరుగుతాయని వెల్లడించారు. ప్రపంచంలో పెట్రో ధరలు పెంచని ఏకైక దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. ఈనెల 10వ తేదీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉంటుందని.. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 10 లక్షల మందితో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.