ఉత్తర తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే పట్టాలెక్కడానికి సర్వం సిద్ధమైంది. రామగుండం-మణుగూరు మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న పాతికేళ్ల నాటి కల ఇప్పుడు సాకారమవుతోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడమే కాకుండా.. పనుల వేగవంతానికి 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో రూ.2911.84 కోట్ల భారీ నిధులను కేటాయించింది. దీంతో దశాబ్దాల కాలంగా సాగుతున్న ప్రజల నిరీక్షణకు తెరపడటమే కాకుండా.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సరికొత్త బాటలు పడనున్నాయి.ఈ రైల్వే మార్గం కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా.. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ రూపుదిద్దుకోనుంది. దీనివల్ల బొగ్గు రవాణా వ్యయం గణనీయంగా తగ్గడమే కాకుండా, రవాణా ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి రామగుండం చేరుకోవడానికి సుమారు 286 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉండగా.. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే ఆ దూరం 90 కిలోమీటర్ల మేర తగ్గిపోనుంది. ఇది ఇటు సింగరేణి సంస్థకు, అటు ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.మొత్తం 207.80 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన బ్రాడ్ గేజ్ మార్గం పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపురం వద్ద ప్రారంభమై మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, కాటాపురం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వరకు సాగనుంది. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం వంటి మారుమూల ప్రాంతాలకు రైలు సౌకర్యం కలగడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం. గతేడాది మే నెలలోనే భూసేకరణ ప్రకటన వెలువడగా.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సర్వేలు, భూపరీక్షలు పూర్తి కావడంతో పనులు వేగంగా మొదలుకానున్నాయి.ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే న్యూఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్, నాగ్‌పూర్-విజయవాడ సెక్షన్లకు ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తుంది. భవిష్యత్తులో దీనిని భద్రాచలం-కొవ్వూరు మార్గంతో అనుసంధానించడం ద్వారా విశాఖపట్నం పోర్టు వరకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచవచ్చని అధికారులు భావిస్తున్నారు. రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టును వచ్చే 10-15 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, రామగుండం-మణుగూరు రైల్వే మార్గం ఆమోదం శుభపరిణామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడారం వంటి మారుమూల ప్రాంతాలకు దీనివల్ల ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయని చెప్పారు. అనేక పర్యాయాలు కేంద్ర రైల్వే శాఖకు విన్నవించానని.. పార్లమెంట్‌లోనూ మాట్లాడినట్లు ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.