18 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం.. ఏఐ ఎంట్రీతో ఉద్యోగం పోయింది.. చివరకు మెక్‌డొనాల్డ్స్‌లో..

Wait 5 sec.

AI Impact: టెక్నాలజీ రంగంలో సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఏఐ రాకతో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, టెక్ రంగంలో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన రోజు రోజుకూ తీవ్రంగా పెరుగుతోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అందులో ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా దశాబ్ధంన్నరకు పైగా అనుభవం ఉన్నప్పటికీ ఏఐ కారణంగా ఉద్యోగం కోల్పోయానంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా 8 నెలల క్రితం తాను ఉద్యోగం కోల్పోయినట్లు పేర్కొంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. తమ టీంలో 12 మంది ఐటీ ఉద్యోగులం ఉండేవాళ్లమని, కంపెనీ తమ అందరినీ తొలగించిందని తెలిపారు. కేవలం ఇద్దరు ఏఐ నిపుణులను మాత్రమే నియమించుకుందని తెలిపారు. 100కు పైగా ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ దొరకలేదని వెల్లడించారు. చివరకు తన కుటుంబ పోషణ కోసం ప్రస్తుతం మెక్ డొనాల్డ్స్‌లో చేరినట్లు తెలిపారు. తనకు తెలిసిన అనేక మంది ఇంజినీర్లు సైతం ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వారిలో కొందరు సంబంధం లేని ఉద్యోగాల్లో చేరారని గుర్తు చేసుకున్నారు. ఈ పోస్టు తాజాగా నెట్టింట తీవ్ర చర్చకు దారి తీస్తోందని తెలిపారు. నెటిజన్లు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆ ఇంజినీర్ ఆవేదనను సమర్థిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అనుభవం ఉన్నవారు ఏఐ సాధనాలు నేర్చుకుంటే వారికి డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి విపత్తు సమయంలో మొదలైన ఉద్యోగాల కోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఒరాకిల్ సంస్థ 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతకు ముందు అమెజాన్, మెటా, గూగుల్ వంటి కంపెనీలు సైతం భారీగా ఉద్యోగులను తొలగించాయి. ముందు ముందు మరింత మందిని తొలగించవచ్చనే సంకేతాలూ ఇచ్చాయి. ఇక దేశీయ ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో చెప్పలేని పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.