ఐపీఎల్ 2026కి ముందు జరిగిన మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వేలం ప్రక్రియ అప్పట్లో సెన్సేషనల్ అయింది. ఓ ఇద్దరు యువ ఆటగాళ్ల కోసం తన పర్స్ మొత్తాన్ని ఖాళీ చేసుకుని సంచలనం సృష్టించింది. కానీ.. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ సగం సీజన్ వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో తెగ ట్రోలింగ్స్‌కు గురయ్యారు. ఎట్టకేలకు ఫైనల్‌గా సీఎస్కే ప్లేయర్ తన రూ. 14.2 కోట్లకు న్యాయం చేసి ప్రశంసలు అందుకున్నాడు. దేశీయ క్రికెట్‌లో రాణించిన కార్తీక్ శర్మ ఈ ఐపీఎల్ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేదు. ఐదు మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చినా తనను తాను నిరూపించుకోలేకపోయాడు. దాంతో చివరగా ముంబై ఇండియన్స్ మీద ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా.. కీలక మ్యాచ్‌ని గెలిపించి గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, కెప్టెన్‌తో సహా అందరూ ఇప్పుడు కార్తీక్ శర్మను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కార్తీక్ శర్మ 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. క్లాస్ షాట్స్ ఆడుతూ.. అనవసర ప్రయోగాలకు వెళ్లకుండా సెలెక్టర్లు, కోచ్‌లను మెప్పించాడు. కార్తీక్ శర్మ, రుతురాజ్ అద్భుత భాగస్వామ్యం అందించడంతో ముంబైపై చెన్నై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కార్తీక్ శర్మ చాలా మంచి ఆట ఆడాడని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. వేలంలో మిగతా ప్లేయర్లతో పోల్చితే భారీ ధరే పలికినప్పటికీ దానికి తగ్గ ఫలితం ఈ రోజు మ్యాచ్‌లో చూయించాని చెప్పాడు. కార్తీక్ శర్మ రోజురోజుకూ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉందని ఫ్లెమింగ్ అన్నాడు. కార్తీక్ శర్మ గుడ్డిగా ఆడే ప్లేయర్ కాదని, అతను కచ్చితంగా సిక్స్ హిట్టరే అని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. అతను తెలివిగా ఏ బౌలర్‌ని అటాక్ చేయాలో ముందుగానే ఎంచుకుంటాడని, అందుకు తగ్గట్టే బ్యాటింగ్ ఆడేస్తాడని రుతురాజ్ అన్నాడు. నెంబర్‌ 4లో ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడని కెప్టెన్ అన్నాడు. మొత్తానికి కార్తీక్ శర్మ ఫామ్‌లోకి రావడం సీఎస్కేకి కలిసొచ్చే అంశం.