మరికొన్ని గంటల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న వేళ.. కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా బయోలో పినరయి విజయన్ కీలక మార్పులు చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో తన ఎక్స్ బయోలో ఉండే 'ముఖ్యమంత్రి' అనే హోదాను తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ స్థానంలో 'పోలిట్ బ్యూరో సభ్యుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)' అని చేర్చారు. ఇక తన సొంత నియోజకవర్గం ధర్మడం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న పినరయి విజయన్.. గత 2 ఎన్నికల్లో (2016, 2021) ధర్మడం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కానీ ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి నుంచి పినరయి విజయన్‌కు గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు.ఇక ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈసారి కేరళంలో అధికారం మార్పిడి తథ్యమని ముక్తకంఠంతో తేల్చి చెబుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా, పీపుల్స్ పల్స్, జేవీసీ వంటి సంస్థలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించి.. అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఇక 140 స్థానాలు ఉన్న కేరళం అసెంబ్లీలో యూడీఎఫ్ 75 నుంచి 90 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి.. రెండో స్థానానికే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. 2021 కేరళం ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకుని ఎల్డీఎఫ్ చారిత్రక విజయాన్ని అందుకుంది. కేరళం వ్యాప్తంగా ఏప్రిల్ 9వ తేదీన ఒకే విడతలో జరిగిన పోలింగ్‌లో 78.27 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే.. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం కేరళంలో ఉండగా.. గత ఎన్నికల్లో (2021) పినరయి విజయన్.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. తాజా ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనుండగా.. ఇప్పుడు అందరి దృష్టి తుది తీర్పుపైనే పడింది.