: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా ఎదురులేని శక్తిగా నిలిచిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)‌కు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుత ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికేలా ఓటర్లు తీర్పును ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా రక్షణ, అవినీతి కుంభకోణాలు, విపక్షాల వ్యూహాలు టీఎంసీ కొంపముంచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్‌లో దీదీ ఓటమికి ప్రధానంగా ఈ ఐదు కారణాలే కారణమని చెబుతున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం. టీఎంసీ వెనుకంజలో ఉండటానికి ప్రధాన కారణాలు ఇవే..మహిళా ఓటర్లే తన బలం అని నమ్మే మమతా బెనర్జీకి.. ఈసారి అదే విభాగం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. 2012 పార్క్ స్ట్రీట్ ఘటన సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపగా.. ఇటీవల ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన ఆ మంటలకు మరింత ఆజ్యం పోసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడం, పెరగడం టీఎంసీ ఓట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అవినీతి కుంభకోణాలు.. టీఎంసీ హయాంలో వెలుగు చూసిన భారీ అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చాయి. అంతేకాకుండా టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో జరిగిన భారీ అక్రమాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం టీఎంసీని ఇరకాటంలో పడేసింది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అనుచరుల ఇళ్లలో కోట్లాది రూపాయల నగదు దొరకడం.. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడం కూడా పార్టీకి నష్టాన్ని కల్గించాయి. ముఖ్యంగా ఈ పార్టీ నేతలు అవినీతి పరులు అని, అందుకు సాక్ష్యం వీడియోలే అంటూ ప్రతిపక్షాలు చేసిన కామెంట్లు ప్రజల మనసుల్లోకి ఎక్కాయి. అలాగే శారద, నారద వంటి పాత కుంభకోణాలు కూడా ఎన్నికల వేళ మళ్లీ చర్చకు రావడంతో.. పార్టీ ఇమేజ్‌ మరింత దిగజారింది. ఓట్ల తొలగింపు ఎఫెక్ట్..అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను పేరుంది. అలాగే వారు ఇక్కడే ఓటు హక్కు సంపాదించుకున్నారని, స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బ తీశారనే ఆరోపణలు టీఎంసీ పరువు తీసింది. ఈక్రమంలోనే ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాలో.. సుమారు 89 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఇందులో చాలా మంది బంగ్లాదేశీయులు ఉన్నారని, వారంతా టీఎంసీకి మద్దతిచ్చేవారని తెలుస్తుండగా.. వీరు ఇప్పుడు మమత పార్టీకి ఓట్లు వేయలేకపోయారు. ఇది కూడా టీఎంసీ ఓటమికి ఓ కారణమైందని అనుకుంటున్నారు.తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత..అలాగే వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రజల్లో దీదీ పాలనపై కొంత అసంతృప్తి నెలకొంది. నిరుద్యోగం, స్థానిక నేతల దౌర్జన్యాలు కేంద్ర నిధుల విషయంలో కేంద్రంతో సాగించిన పోరు అభివృద్ధిని అడ్డుకుందనే భావన ఓటర్లలో పెరిగింది. ఇది బీజేపీకి సానుకూల అంశంగా మారింది. అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నేతలపై చేస్తున్న దాడులు రాజకీయ కుట్ర అని మమత వాదించినప్పటికీ.. బీజేపీ మాత్రం దీనిని అవినీతిపై పోరాటంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అలాగే హిందూ ఓట్ల ఏకీకరణ, కేంద్ర పథకాల ప్రచారం బీజేపీకి మైలేజ్ తెచ్చి పెట్టాయి. ఇలా టీఎంసీ వెనకంజకు ఇవన్నీ కారణాలుగా మారాయి.