దొంగలను పట్టిస్తే రూ.లక్ష బహుమతి.. కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన

Wait 5 sec.

ఆదివారం రోజున కరీంనగర్ నగర నడిబొడ్డున ఉన్న పీఎంజీ జ్యువెలరీ దుకాణంలో జరిగిన భారీ చోరీ.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బైక్‌లపై సాధారణ కస్టమర్ల లాగా వచ్చిన ఐదుగురు నిందితులు.. క్షణాల్లో బీభత్సం సృష్టించారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. కాల్పులు జరపడంతో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో ఆ జ్యువెలరీ షాప్‌లో ఉన్న సిబ్బంది, ఇతర కస్టమర్లు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ నేపథ్యంలోనే ఈ చోరీని తీవ్రంగా పరిగణించిన కరీంనగర్ పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఐదుగురు నిందితుల ఫోటోలను రిలీజ్ చేసిన పోలీసులు.. వారిని పట్టించిన వారికి రూ.1 లక్ష ఇస్తామని తెలిపారు. ఈ కాల్పులు, చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. నగరంలో ఉన్న సీసీటీవీలు అన్నింటినీ జల్లెడ పడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. నిందితులకు సంబంధించిన ఫోటోలను మీడియా, సోషల్ మీడియాతోపాటు ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా బాగా వైరల్ చేస్తున్నారు. ఈ దొంగల ఫోటోలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించారు. వీరిని పట్టుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసులు కూడా అలర్ట్ అయి.. దొంగలను పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికైనా ఈ దొంగల సమాచారం తెలిస్తే డయల్ 100 , కరీంనగర్ 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ 8712670762.. కరీంనగర్ టౌన్ ఏసీపీ 8712670711.. కరీంనగర్ ఎస్పీ కంట్రోల్ 8712670713 నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగల సమాచారాన్ని అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామ‌ని స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనలో ముగ్గురు జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. సాధారణ కస్టమర్ల లాగా జ్యువెలరీ షాప్‌లోకి చొరబడిన ఆ దొంగలు.. బంగారు నగలు చూపించాలని సిబ్బందిని కోరారు. బంగారం మొత్తం బయటికి తీయగానే.. తమ వెంట తెచ్చుకున్న తుపాకులను తీసి సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే దాదాపు కిలో బంగారాన్ని దోచుకుని పారిపోయారు. కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటికి అతి సమీపంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఆ ప్రాంతంలో బండి సంజయ్.. అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయగా.. అప్పటివరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో పట్టపగలే భారీ దోపిడీ జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.