ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వచ్చే ముూడు గంటల్లో పల్నాడు, ప్రకాశం జిల్లాలలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సోమవారం (మే 4) రోజున అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లోని 27 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండలో వెళ్లేవారు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అలాగే వర్షం కురిసే సమయంలో రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. మరోవైపు ఆదివారం రోజున గూడురులో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొప్పెరపాడులో 46.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఆదివారం రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అత్యధికంగా 72.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాట్రేనికోనలో 57.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తమ పంటలు తడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని,,పిడుగులు పడే అవకాశం ఉన్నందుకు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.