ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు అదరగొట్టారు.. టాప్‌ మార్కులతో సత్తా చాటారు. నలుగురు అమ్మాయిలు ఏకంగా 596 మార్కులు సాధించారు.. మరో 9మందికి 595 మార్కులు వచ్చాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గతేడాది నిర్వహించిన మాక్ అసెంబ్లీలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు పాల్గొన్న సంగతి తెలిసిందే. టెన్త్ ఫలితాల్లో మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేలుగా అదరగొట్టిన విద్యార్థులు కూడా సత్తా చాటారు. వీరిలో కొంతమంది విద్యార్థులు రాష్ట్ర టాపర్లుగా నిలిచారు. మాక్ అసెంబ్లీలో కాకినాడ జిల్లా శంఖవరం మండలం ఏపీ మోడల్‌ హైస్కూల్‌కు చెందిన సైపిరెడ్డి స్వాతి స్పీకర్‌ స్థానంలో సభా వ్యవహారాలు నడిపారు.. ఆమె ఏకంగా 594 మార్కులు సాధించారు. డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన కడప జిల్లా శెట్టివారిపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని పసల వీర ఉదయశ్రీ 592 మార్కులు సాధించారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ జడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని సాయి సౌమ్యకు 572 మార్కులు వచ్చాయి. రవాణాశాఖ మంత్రిగా వ్యవహరించిన చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎన్‌ ప్రియదర్శినికి 572 మార్కులు వచ్చాయి. వీరితో పాటుగా మాక్ అసెంబ్లీలో అనంతపురం ఎమ్మెల్యేగా వ్యవహరించిన చేసిన విద్యార్థిని సదాఫ్‌ నాజ్‌ 588 మార్కులతో అదరగొట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా వ్యవహరించిన యాడికికి చెందిన విద్యార్థి అనిల్‌ కుమార్‌‌ 584 మార్కులు సాధించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా వ్యవహరించిన తలారి అభిజ్ఞకు 583 మార్కులు వచ్చాయి. అలాగే మాక్ అసెంబ్లీకి హాజరైన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి రెడ్డి చంద్ర లాస్య 586, తమ్మినాన నవ్యశ్రీ 587 మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని సంతోషికి 585 మార్కులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి భరత్‌సాయికి 583 మార్కులు.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగుపురం జెడ్పీ హైస్కూలు విద్యార్థిని నిహారిక 586 మార్కులు సాధించారు.