వేసవి సెలవుల్లో సరదాగా ఆడుకోవాలనుకున్న ఆ బాలుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. ఆడుకునే బొమ్మలో బ్యాటరీ అమర్చుతుండగా అది ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ చిన్నారి మెదక్ జిల్లా శివ్వంపేటలో ఆదివారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివ్వంపేటకు చెందిన మమత, సత్తయ్య దంపతుల కుమారుడు శివతేజ స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్న శివతేజ.. ఆడుకోవడానికి తన వద్ద ఉన్న ఒక పాత బొమ్మను బయటకు తీశాడు. అది పనిచేయడానికి స్థానిక కిరాణా దుకాణంలో రూ. 25 పెట్టి ఒక 9V బ్యాటరీని కొనుగోలు చేశాడు. ఆ బ్యాటరీని బొమ్మలో వేసి ఆడుకుంటున్న క్రమంలో అది అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలిపోయింది.ఈ పేలుడు ధాటికి బాలుడి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చేతి మూడు వేళ్లు తెగిపోయి రక్తసిక్తమవడంతో చిన్నారి ఆర్తనాదాలు మిన్నంటాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే శివతేజను శివ్వంపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. గాయాల తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కొంపల్లిలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు. నాసిరకం ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీల విషయంలో పిల్లలను అప్రమత్తం చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు భరించలేక ఒక మహిళ తన కుమారుడితో కలిసి అతడిని దారుణంగా హతమార్చింది. ఈ ఘటన చింతల్‌ అంబేద్కర్‌నగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నిందితులు హత్య చేయడమే కాకుండా.. శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి, ఒక మహిళ గత పదేళ్లుగా హైదరాబాద్‌లోనే సహజీవనం చేస్తున్నారు. ఆమెకు 19 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా శివారెడ్డి ఆ మహిళను, ఆమె కుమారుడిని తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి గొడవ ముదరడంతో.. తల్లీకొడుకులు మటన్ కొట్టే కత్తితో శివారెడ్డిపై దాడి చేశారు. దీంతో శివారెడ్డి అక్కడికక్కడే మరణించాడు. అనంతరం హత్య ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఒక సంచిలో మూటగట్టారు. ఆ శవాన్ని ఊరు వెలుపల ఎక్కడైనా పారేసేందుకు ప్రయత్నిస్తుండగా.. స్థానికుల ద్వారా అందిన సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులైన మహిళను, ఆమె కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.