తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమిళనాడులో 118 స్థానాల మెజార్టీ మార్కుకు సమీపంలోకి వచ్చి ఆగింది. టీవీకే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. వెనుక అనిల్ ఆర్మీ పాత్ర ఎంతో ఉంది. 6 దశల్లో పక్కాగా ప్లాన్ చేసిన అనిల్ ఆర్మీ.. అనిల్ అంటే తమిళ భాషలో ఉడుత అని అర్థం. అంటే ఈ అనిల్ ఆర్మీ.. ఉడుతా భక్తి సాయంగా టీవీకే పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. విజయ్ రాజకీయాల్లోకి రాకముందు.. సినిమా హీరోగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ అభిమానులే ఫ్యాన్స్ అసోసియేషన్‌లుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. టీవీకే పార్టీని 2024 ఫిబ్రవరిలో విజయ్ స్థాపించినప్పటికీ.. అంతకుముందు నుంచే ఆయన అభిమానులు సంక్షేమం, సేవా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. 2009లోనే విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ మక్కల్ ఇయక్కంగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పనిని ప్రారంభించాయి. ఫ్యాన్స్ అందర్నీ ఒక్కటి చేయడం.. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం.. కార్పొరేట్ తరహాలో క్రమశిక్షణాయుతమైన కేడర్‌ను తయారు చేయడం వంటి 6 దశల ప్రణాళికాబద్ధమైన కృషితోపాటు.. పార్టీ గుర్తు, వాట్సాప్ నెట్‌వర్క్‌ల ద్వారా స్థానిక సేవా కార్యక్రమాలను ఎన్నికల ప్రచారంగా మార్చి.. అనిల్ ఆర్మీ గుర్తింపుతో చిన్న చిన్న మద్దతును విజయ్ పెద్ద విజయంగా మార్చుకుని.. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. సంక్షేమ, సేవా మొదలైన విజయ్ మక్కల్ ఇయక్కం సంస్థ.. సహాయక కార్యక్రమాలు, స్టూడెంట్స్‌కు సాయం చేయడం.. క్షేత్ర స్థాయిలో పలు కార్యక్రమాలను చేపట్టి బూత్ స్థాయిలో ప్రజలతో గట్టి అనుబంధం ఏర్పరుచుకుంది. తాజా విజయం పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే వచ్చినా.. దానికి ఎన్నో ఏళ్ల సాధన, మార్పులు, వ్యూహాత్మక నిర్మాణం ఉందని తెలుస్తోంది.ఆరు దశల్లో టీవీకేకు విజయం తెచ్చిపెట్టిన అనిల్ ఆర్మీతొలి దశలో.. విజయ్‌కి ఉన్న లక్షలాది మంది అభిమానులను కేవలం సినిమా ప్రమోషన్లకు మాత్రమే పరిమితం చేయకుండా.. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేశారు. రక్తదాన శిబిరాలతోపాటు.. సహాయక చర్యలు, విద్యార్థుల సన్మానాల ద్వారా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఒక బలమైన వ్యవస్థను నిర్మించారు. రెండో దశలో.. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పెట్టకముందే.. పార్టీ పేరు లేకుండానే తన మద్దతుదారులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపి విజయ్ తన బలాన్ని పరీక్షించుకున్నారు. ఆ ఎన్నికల్లో మొత్తం 169 మంది పోటీ చేయగా.. వారిలో 115 మంది విజయం సాధించడం ద్వారా.. అభ్యర్థులను ఎంపిక చేయడం, ఓట్లను సమీకరించడంలో తమ నెట్‌వర్క్ ఎంత పటిష్టంగా ఉందో టెస్ట్ చేసుకున్నారు.ఇక మూడో దశలో.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కేవలం అభిమానం ఉంటే సరిపోదని భావించిన విజయ్.. కార్పొరేట్ తరహాలో ఇంటర్వ్యూలు, బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌ల ద్వారా సమర్థులైన వారిని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇది పార్టీలో సరికొత్త క్రమశిక్షణను తీసుకువచ్చింది. మరోవైపు.. నాలుగో దశలో.. టీవీకే పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన.. విజిల్ గుర్తును ఇంటింటికీ తీసుకెళ్లడంలో అనిల్ ఆర్మీ సక్సెస్ అయింది. మహిళలు తమ ఇళ్ల ముందు విజిల్ ఆకారంలో ముగ్గులు వేయడం ద్వారా విజయ్‌కి తమ మద్దతును ప్రకటించారు. ఇక ఐదో దశలో.. ఏళ్ల తరబడి ఉన్న విజయ్ ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూపులను తమ ఎన్నికల ప్రచార సాధనాలుగా టీవీకే పార్టీ మార్చింది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం పార్టీ హైకమాండ్‌కు చేరడం.. టీవీకే నాయకత్వం నుంచి ఆదేశాలు కిందికి రావడం వంటి అంశాలను విజయ్ నేరుగా పర్యవేక్షించారు. చివరిగా ఆరో దశలో.. విజయ్ తన అభిమాన సంఘాలకు 'అనిల్' (ఉడుత) అనే ప్రత్యేక గుర్తింపును ఇచ్చారు. శ్రీరాముడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకునేందుకు వారధి నిర్మాణంలో సహాయపడిన ఉడుతతో.. తన మద్దతుదారులను 2011లో విజయ్ పోల్చారు. చిన్న చిన్న సహాయాలు కలిసి పెద్ద విజయాన్ని ఎలా అందిస్తాయో ఇప్పుడు అనిల్ ఆర్మీ తమిళనాడులో నిరూపించింది. టీవీకే ప్రత్యర్థులు ఈ అనిల్ ఆర్మీని ఎగతాళి చేసినప్పటికీ.. చివరకు అదే వారి బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.