అన్నమయ్య జిల్లా నుంచి పొట్టకూటి కోసం మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన తెలుగు మహిళ షెహనాజ్ ఆవేదనపై స్పందించారు. ఆమెను మస్కట్ నుంచి సొంతూరికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఆదేశాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులు సంప్రదించారు. షెహనాజ్‌ను సురక్షితంగా మన దేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన దూదేకుల షహనాజ్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు. పిల్లలను చదివించాలనే ఆశతో, బతుకుదెరువు కోసం ఏజెంట్ సాయంతో కొన్నిరోజుల క్రితం షహనాజ్ అప్పులు చేసి మరీ మస్కట్ వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి సేఠ్ షహనాజ్‌ను ఓ గదిలో బంధించి కొట్టడం, వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి బాధితురాలు పవన్ కళ్యాణ్‍‌తో తన గోడు వెళ్లబోసుకుంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. సేఠ్ నిత్యం తనను వేధిస్తూ, కొడుతున్నాడని.. ఫిట్స్ వచ్చి చనిపోయేలా ఉన్నానని గోడు వెళ్లబోసుకున్నారు.తనకు మాట్లాడే సమయం కూడా లేదని.. బాత్రూమ్‌లో నుంచి ఈ వీడియో చేస్తున్నానని.. తాను చనిపోతే తన ముగ్గురు పిల్లలు దిక్కులేకుండా పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తనను కాపాడాలని వేడుకున్నారు. పవన్ కళ్యాణ్ అన్నా కాపాడన్నా అంటూ రోదిస్తూ ఆమె పంపిన వీడియో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కదిలించింది. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నారని, ప్రాణాలు పోయేలా ఉన్నాయన్న ఆమె మాటలతో పవన్ కళ్యాణ్ చలించిపోయారు.షహనాజ్‌ను తక్షణం స్వదేశానికి రప్పించే అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంవో వర్గాలు షహనాజ్ భర్త ద్వారా ఒమన్ లోని ఏజెంట్‌తో మాట్లాడారు. అక్కడ దౌత్య కార్యాలయాన్ని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదించారు. షెహనాజ్‌ను సాధ్యమైనంత త్వరగా సొంతూరికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.