తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇన్నాళ్లూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన దళపతి విజయ్.. ఇప్పుడు ఎన్నికల బరిలో దుమ్ముదులుపుతున్నారు. తొలిసారి ఎన్నికల్లో పాల్గొన్న విజయ్.. ప్రభంజనం సృష్టిస్తున్నారు. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ తోటి నటుడు గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దళపతిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు తమిళనాడు ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తోన్న టీవీకే అధినేత విజయ్‌కి టాలీవుడ్ హీరో నాని అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్‌ను గెలిపించిన ప్రజలు.. ఇప్పుడు తమిళనాట విజయ్‌ని గెలిపించారని అర్థం వచ్చేలా పరోక్షంగా ట్వీట్ చేశారు. ''విజయ్ సర్, మీకు అభినందనలు. మొదట సందేహించారు, ఆ తర్వాత విజేతగా నిలిచారు. మా ఇంట్లో జరిగింది, ఇప్పుడు మా పక్కింటిలో జరుగుతోంది. అండర్‌డాగ్ గెలవడమే అసలైన సినిమా (లేదా అసలైన రాజకీయాలు అనాలా?). తమ నిర్ణయాన్ని స్పష్టం చేసిన తమిళనాడు ప్రజలకు మరిన్ని గొప్ప విజయాలు కలగాలని ఆశిస్తున్నాను'' అని నాని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సింగిల్ గా పోటీ చేసి గెలిచిన విజయ్ ని, పొత్తులో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేయడంపై నెటిజన్లు నానిని ట్రోల్ చేస్తున్నారు.''మన భారతీయ సినీ పరిశ్రమకు చెందిన దళపతి విజయ్ గారు తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ, ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం చూసి గర్వంగా ఉంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. జననాయకుడు'' అని హీరో నిఖిల్ సిద్దార్థ పోస్ట్ పెట్టారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా నిఖిల్ స్పందించారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ''పశ్చిమ బెంగాల్ ప్రజలు మర్చిపోలేదు, క్షమించలేదు. సామాన్యుడిని పట్టించుకోని ప్రభుత్వానికి వారు గుణపాఠం నేర్పారు. ఆర్.జి. కార్ వైద్య కళాశాల ఘోరానికి న్యాయం జరగాలి'' అని ఆయన పోస్ట్ పెట్టారు. ''విజిల్ పోడు విజయ్ అన్న. ఇది మీ సంకల్పం, అద్భుతమైన కృషి గురించి గొప్పగా చెప్పే ఒక చారిత్రాత్మక విజయం. ఒక నటుడు, లేదా ఒక దేవుడిలాంటి వాడు... ప్రజా ప్రేమతో అందరి అంచనాలను తప్పు అని నిరూపించినప్పుడు కలిగే ఆనందం వేరేలా ఉంటుంది! ఇది సర్వసాధారణం, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో.. తమిళనాడు ప్రజలు భారీ సంఖ్యలో తమ తీర్పును ఇచ్చారు. అందరూ ఎదురుచూస్తున్న మార్పును మీరు తీసుకువస్తారని ఆశిస్తున్నాను.. ఈ అఖండ విజయానికి హృదయపూర్వక అభినందనలు. మీకు మరిన్ని గొప్ప విజయాలు లభిస్తాయి'' అని సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశారు. ''ఒరు వైరల్ పురచ్చి.. విజిల్ పోడు విజయ్.. ప్రజలు తమ తీర్పు చెప్పారు.. దశాబ్దాలుగా ఎంతో మంది ప్రయత్నించారు.. కానీ ప్రజలు కోరుకుంటే అధికారం వారిదే అని మీరు నిరూపించారు.. మన తమిళుల మార్పు, శ్రేయస్సు కోసం ఎదురుచూస్తున్నాము.. అభినందనలు'' అని వరలక్ష్మి శరత్ కుమార్ పోస్ట్ పెట్టారు. ''కంగ్రాట్స్‌ విజయ్‌. ఇది చారిత్రాత్మక విజయం. గతంలో ఇలాంటి గెలుపు లేదు.. భవిషత్తులో రాదు'' అని జీవి ప్రకాష్ కుమార్‌ ట్వీట్ చేశారు.