పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా సాగుతోంది. బెంగాల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సాహిత్యం, కళలు.. ఆ తర్వాత ఘుమఘుమలాడే చేపల పులుసు. కానీ, ఆ పళ్లెంలోని చేప ముక్కే రాజకీయ రణరంగానికి కేంద్ర బిందువు అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడు, గూడు, గుడ్డ నుంచి రాజకీయం సామాన్యుడి కంచంలోకి చేరింది. బెంగాలీ సంప్రదాయ ఆహారంలో అత్యంత ముఖ్యమైన చేపల వంటకం, వీధి ఆహారం టీఎంసీ, బీజేపీల మధ్య మధ్య మాటల మంటలు రేపింది. కానీ, ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ ‘చేపల యుద్ధం’లో అంతిమంగా బీజేపీ గెలిచింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధిస్తారని, బెంగాలీల ఆహారమైన చేపలు, మాంసం, గుడ్లు తినలేమని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కమలనాథులు తిప్పికొట్టారు. బెంగాల్ సెంటిమెంట్ అయిన ‘మాచ్-భోత్’ (చేపల -అన్నం) సంస్కృతిని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని విస్తృతంగా దీదీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మలేదు. మాంసాహారంపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని నమ్మకం కలిగించేందుకు బీజేపీ నేతలు ఏకంగా చేతిలో చేపలు పట్టుకుని ప్రచారం చేయడం గమనార్హం.బెంగాలీ అస్తిత్వం, మన ఆహారపు అలవాట్లను కాపాడుకోవాలంటే కేవలం టీఎంసీకే ఓటు వేయాలన్న దీదీ పిలుపును బెంగాలీలు పట్టించుకోలేదు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇంటర్వ్యూలు, సభలు, పోస్టర్ల ద్వారా బీజేపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఝార్గ్రామ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక కిరాణా షాపు వద్ద ఆగి ‘ఝాల్‌మురి’ తిన్నారు. మోదీ జల్‌మురి తింటున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఝాల్ మురీ' (మరమరాల స్నాక్‌)కి స్వయంగా డబ్బులు చెల్లించిన ప్రధాని షాపు నడిపే వ్యక్తితో మాట్లాడారు. ‘మీరు ఉల్లిపాయ తింటారా?’ అని అతడిగే అడిగితే... ‘హా తింటాను, బుర్ర మాత్రం తినను’ అంటూ ప్రధాని నవ్వులు పూయించారు. దీనిపై కూడా మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మోదీ వెళ్లిన దుకాణంలో వ్యక్తి ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు అంటూ ఆరోపించారు.ముందస్తు షెడ్యూల్‌ లేకుండా, అకస్మాత్తుగా మోదీ ఆగితే కెమెరాలు సిద్ధంగా ఉండటం ఏంటి అని, ఈ ఎపిసోడ్‌ అంతా ఒక స్క్రిప్ట్‌ ప్రకారం జరిగిందని విమర్శించారు.. ప్రధాని జేబులో రూ.10 నోటు పెట్టుకుని తిరుగుతున్నారంటే నమ్మేలా ఉందా అంటూ ఎద్దేవా చేశారు. దీనికి బీజేపీ నేతలు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని ఝాల్‌మూరి తింటే ఆమెకు ఎందుకంత ఉలుకుపాటు అని తిప్పికొట్టారు.