విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. అంచనాలను తలకిందులు చేస్తూ.. డీఎంకే, అన్నాడీఎంకేలకు షాకిస్తూ.. విజయ్ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరోవార్త తెరమీదకు వచ్చింది. విజయ్ టీవీకే పార్టీ తరుఫున సినీ నటి త్రిష.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. టీవీకే పార్టీ ప్రభంజనం నేపథ్యంలో సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగుతోంది. మే నాలుగో తేదీ త్రిష పుట్టినరోజు కావటంతో సోమవారం రోజున.. ఆమె. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీవీకే పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో.. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే త్రిష రాజకీయ ప్రవేశం వార్తలు జోరందుకున్నాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్.. రెండుచోట్ల పోటీ చేశారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ స్థానాల్లో పోటీచేసిన విజయ్.. రెండు చోట్లా గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దీనికి తోడు టీవీకే పార్టీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ రెండుచోట్ల పోటీ చేసిన నేపథ్యంలో.. రెండుచోట్లా గెలుపొందితే, ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ రాజీనామా చేసిన స్థానం నుంచి త్రిష బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు టీవీకే కానీ.. ఇటు త్రిష కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సీఎం అవుతానంటూ గతంలో త్రిష చేసిన వ్యాఖ్యల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనికి తోడు టీవీకే గెలిస్తే త్రిష పవర్ సెంటర్‍గా నిలుస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.దీనిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.