: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాల కాలంగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే మారిన తమిళ అధికారం.. ఈసారి మూడో ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలి రౌండ్లలోనే సాధిస్తున్న ఆధిక్యం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన ముందే విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తారని జోస్యం చెప్పారు. ఆపూర్తి వివరాలు మీకోసం.ఏడు నెలల క్రితమే పీకే అంచనా..!రాజకీయాల్లో నాడి పట్టుకోవడంలో దిట్టగా పేరున్న ప్రశాంత్ కిషోర్.. దాదాపు ఏడు నెలల క్రితమే విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 2025లో ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ.. "విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని వ్యూహాత్మకంగా, చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్తే.. తమిళనాడులో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి" అని కుండబద్దలు కొట్టారు. నేడు వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే పీకే అంచనా వేసినట్లుగానే విజయ్ ఎవరూ ఊహించని ఫలితాలు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.విజయ్‌కు పీకే ఇచ్చిన సలహా ఇదే..సినిమా గ్లామర్ మాత్రమే రాజకీయాల్లో గెలుపును తెచ్చిపెట్టదని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని అప్పట్లోనే విజయ్‌కు పీకే సూచించారు. "తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకునే ఓటు బ్యాంకు చాలా పెద్దదిగా ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాలంటే విజయ్ విశ్రమించకుండా పని చేయాలి" అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా "నేను తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన బిహారీగా ఎదగాలి. అందుకే నేను ఎం.ఎస్ ధోనీతో పోటీ పడుతున్నాను. ఆయన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎలాగైతే గెలిపించారో.. నేను మీ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని అలా గెలిపిస్తాను. అందుకే నేను ఇక్కడకు వచ్చాను" అంటూ తెలిపారు. కింగ్ మేకర్‌గా విజయ్..?ప్రస్తుత కౌంటింగ్ ఫలితాల ప్రకారం.. విజయ్ టీవీకే పార్టీ 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే ఏఐఏడీఎంకే 74 స్థానాల్లో, డీఎంకే 53 స్థానాల్లో మెజార్టీ కనబరుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. టీవీకే విజయం ఖాయమని అర్థం అవుతుండగా.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా కొన్ని కీలక నియోజక వర్గాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉండటంతో.. టీవీకేనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. చాడాలి మరి విజయ్ టీవీకే పార్టీ ఎన్ని సీట్లు సాధించి ప్రభంజనం సృష్టిస్తుందనేది.