తమిళనాడులో క్యాంప్ రాజకీయాలు.. టీవీకే అభ్యర్థుల కోసం లగ్జరీ రిసార్ట్‌ బుక్ చేసిన విజయ్

Wait 5 sec.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌ డీఎంకే పార్టీకే పట్టం కట్టగా.. పలు సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఒకవేళ ఫలితాలు అటూ ఇటూగా వస్తే.. తమ అభ్యర్థులను ఇతర పార్టీలు ఎత్తుకుపోకుండా ఉండేందుకు రిసార్ట్ రాజకీయాలకు తెరలేపాయి. ఈ క్రమంలోనే టీవీకే అభ్యర్థులకు ఆ పార్టీ చీఫ్ కీలక సూచనలు చేశారు. టీవీకే అభ్యర్థుల కోసం ఏకంగా ఒక రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేశారు. సోమవారం రోజున కౌంటింగ్ నిర్వహించి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెలువరించనున్న నేపథ్యంలో.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ అత్యంత అప్రమత్తత పాటిస్తున్నారు. పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడనున్నట్లు వెల్లడి కావడంతో.. తన పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు రిసార్ట్ రాజకీయాలకు తెరతీశారు. ఈ క్రమంలోనే మహాబలిపురం సమీపంలోని పూంజేరి వద్ద ఉన్న ఒక లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్‌ మొత్తాన్ని టీవీకే పార్టీ బుక్ చేసింది. సుమారు 100 మందికి పైగా బస చేసే సదుపాయం ఉన్న ఆ విలాసవంతమైన రిసార్ట్‌లో.. టీవీకే పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు అందరినీ ఒకేచోట ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర పార్టీలు.. టీవీకే అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేయకుండా విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా టీవీకే పార్టీ అభ్యర్థులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో విజయ్ కీలక ఆదేశాలు ఇచ్చారు.ఎన్నికల్లో గెలిచినట్లు అధికారులు ప్రకటించిన వెంటనే.. అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ రిసార్ట్‌కు చేరుకోవాలని విజయ్.. సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులకు అందుబాటులో ఉండొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారం కోసం.. ఇతర పార్టీలు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు, పదవుల ఆశ కల్పించే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన టీవీకే.. ఈ క్యాంప్ రాజకీయాల ద్వారా తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్.. తొలిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన విజయ్.. తన పార్టీ తరఫున గెలిచిన నేతలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులో ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రేపు ఫలితాలు వెల్లడించిన తర్వాత.. ఈ క్యాంప్ రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి ఆ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.