బాత్రూంలో ఉరేసుకుని యువ జడ్జి ఆత్మహత్య.. భార్యతో గొడవే కారణమంటున్న తల్లిదండ్రులు

Wait 5 sec.

ఢిల్లీలో ఒక యువ న్యాయమూర్తి.. తన ఇంట్లోని బాత్రూంలో విగతజీవిగా కనిపించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందే అతడు.. తన భార్యతో వాగ్వాదం జరిగిందని.. ఆ సమయంలో బాగా ఏడ్చి, కుమిలిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక ఆ యువ జడ్జి భార్య కూడా జడ్జిగా పనిచేస్తున్నారని.. ఆమెతో గత కొంతకాలంగా గొడవలు జరగడంతో.. మానసికంగా తమ కుమారుడు తీవ్రంగా కుంగిపోయాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. ఆత్మహత్యలో ఎలాంటి కుట్ర కోణం లేదని ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సౌత్ ఢిల్లీలోని గ్రీన్ పార్క్‌ ప్రాంతంలో నివసిస్తున్న 30 ఏళ్ల జడ్జి అమన్ కుమార్ శర్మ.. తన ఇంటి బాత్రూమ్‌లో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అమన్ కుమార్ శర్మ ప్రస్తుతం కర్కర్దూమా కోర్టులో నార్త్ ఈస్ట్ ఢిల్లీ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని కర్కర్దూమా బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది.ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. మృతుడి బావ శివం ఫోన్ చేసి.. తన బావమరిది ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాత్‌రూమ్‌లో ఉన్న అమన్ కుమార్ శర్మను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అమన్ కుమార్ శర్మ చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. ప్రాథమిక విచారణలో అమన్ కుమార్ శర్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం కనిపించలేదని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.అయితే అమన్ కుమార్ శర్మ తండ్రి చేస్తున్న ఆరోపణలు మాత్రం వేరుగా ఉన్నాయి. అమన్ కుమార్ శర్మ చనిపోవడానికి ముందు రోజు రాత్రి 10 గంటలకు తనకు ఫోన్ చేశాడని తండ్రి చెప్పారు. తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని.. బతకడం తనకు చాలా కష్టంగా మారిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో రాజస్థాన్ అల్వార్‌లో ఉన్న అతడి తండ్రి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి అర్ధరాత్రి కల్లా చేరుకున్నారు.అయితే గత 2 నెలల నుంచి.. అమన్ కుమార్ శర్మ తన భార్యతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమన్ కుమార్ శర్మ భార్య కూడా న్యాయ అధికారిగా పనిచేస్తోందని.. ఆమె సోదరి జమ్మూలో ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తనను ఇంట్లో భార్య మానసికంగా తీవ్రంగా వేధిస్తోందని.. తన కుమారుడు తనతో చెప్పినట్లు తండ్రి ఆరోపించారు. ఇంట్లో మొత్తం అతడి భార్యదే పెత్తనం అని.. అంతా ఆమె ఇష్ట ప్రకారమే జరుగుతుందని తన కుమారుడు చెప్పినట్లు తండ్రి గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న గొడవలను పరిష్కరించేందుకు.. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే.. వారు తమ ఫోన్ నంబర్లను బ్లాక్ చేశారని ఆరోపించారు.అయితే ఈ ఘటనకు ముందు ఇంట్లో పెద్ద పెద్దగా అరుపులు, ఒకరిపై ఒకరు వాదనలు చేసుకోవడం వినిపించినట్లు అమన్ కుమార్ శర్మ తండ్రి తెలిపారు. అమన్ కుమార్ శర్మ ఒక రూంలో ఉంటే.. అతడి భార్య మరో రూంలో ఉందని.. ఆమె గట్టిగా మాట్లాడటంతో అమన్ కుమార్ శర్మ ఏడ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ తర్వాత అమన్ కుమార్ శర్మ కనిపించకపోవడంతో.. అతనికి ఫోన్‌ చేస్తే.. అది బాత్రూమ్‌లో రింగ్ అయినట్లు చెప్పారు. దీంతో బాత్రూం కిటికీ అద్దాలను పగులగొట్టి లోపలికి వెళ్లగా.. అతడు ఉరివేసుకుని కనిపించారని పేర్కొన్నారు.2018లో పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ నుంచి లా పూర్తి చేసిన అమన్ కుమార్ శర్మ.. 2021 జూన్ 19వ తేదీన ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో చేరారు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో క్రిమినల్, సివిల్ కేసులను అమన్ కుమార్ శర్మ డీల్ చేశారు. ఇక 2025 అక్టోబర్ నుంచి కర్కర్దూమా కోర్టులో డీఎల్ఎస్ఏ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అమన్ కుమార్ శర్మ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించిన పోలీసులు.. అసలు ఈ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులను, సన్నిహితులను పోలీసులు విచారణ జరుపుతున్నారు.