ఏపీ డిప్యూటీ సీఎం పపన్ కళ్యాణ్ ఓ డీఎస్పీ వ్యవహార శైలి మీద సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని వ్యవహార శైలి మీద ఎస్పీ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహారాల శైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, అలాగే డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదులు అందాయి. దీనికి తోడు వివాదాలతో డీఎస్పీ జయసూర్య కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారంటూ కూడా డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చినట్లు తెలిసింది.*ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద ఫోన్‌లో చర్చించారు. ఈ క్రమంలోనే తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించారు. అనంతరం భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించారు.అసాంఘిక వ్యవహారాలకు డి.ఎస్.పి. స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. *అలాగే పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి స్పష్టం చేశారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలని స్పష్టం చేశారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.* మరోవైపు భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంవో అధికారులను ఆదేశించారు. అలాగే డీజీపీకి కూడా ఈ విషయాలను తెలియజేయాలని ఆదేశించారు. మరోవైపు ఓ డీఎస్పీ మీద పవన్ కళ్యాణ్ ఇంతలా సీరియస్ అవ్వడానికి కూడా పలు కారణాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల పేర్లు.. అందులోనూ జనసేన పార్టీ నేతల పేర్లు వాడుకుంటూ డీఎస్పీ జయసూర్య అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావటంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మరోవైపు వైసీపీ హయాంలో జయసూర్య గన్నవరం డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత భీమవరం బదిలీ అయ్యారు.