: భారత స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ వరుసగా లాభాల్ని నమోదు చేస్తున్నాయి. గత వారం పుంజుకున్న సూచీలు.. ఈ వారం కూడా మంచి లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. కిందటి రోజు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకుపైగా పెరగ్గా.. ఇవాళ మూరత్ ట్రేడింగ్ నేపథ్యంలో మధ్యాహ్నం 1.45- 2.45 మధ్య స్పెషల్ ట్రేడింగ్ జరిగింది. ఇక్కడ సెన్సెక్స్ 62 పాయింట్లు పెరిగి 25,850 మార్కుపైన స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 25 పాయింట్లు పుంజుకొని 25,869 వద్ద సెషన్ ముగించింది. గత కొంత కాలంగా మూరత్ ట్రేడింగ్ వేళ భారీగా పుంజుకున్న సూచీలు ఈసారి పెద్దగా రాణించలేదు. అయితే ఇక్కడే ఒక దిగ్గజ కంపెనీ స్టాక్ మాత్రం అదరగొట్టింది. అదే ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై- సెప్టెంబర్) ఫలితాల్ని ప్రకటించింది. ఇక్కడ అంచనాల్ని మించి రాణించింది. కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 54 శాతం పెరిగి రూ. 186 కోట్లకు చేరుకుంది. సంస్థ కార్యకలాపాల ఆదాయం 12 శాతం ఎగబాకి రూ. 3772.7 కోట్లుగా నమోదైంది. ఎబిటా కూడా 39 శాతం పెరిగింది. టైర్లపై జీఎస్టీ రేట్లు తగ్గడంతో దేశీయంగా మంచి డిమాండ్‌తో లాభాదాయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు సియట్ కంపెనీ షేర్లపై మంచి ఆసక్తి కనబరిచారు. సోమవారం సెషన్‌లో ఏకంగా 12 శాతానికిపైగా పెరిగి కాసుల పంట పండించిందని చెప్పొచ్చు. అక్టోబర్ 17న ఈ స్టాక్ ధర NSE లో రూ. 3,702 వద్ద స్థిరపడగా.. అక్టోబర్ 20న ఇది ఏకంగా 12 శాతానికిపైగా పెరిగి రూ. 4,166 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలోనే రూ. 4,203 దగ్గర ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కిందటి సెషన్‌తో పోలిస్తే ఇక్కడ స్టాక్ ధర ఏకంగా రూ. 520 కిపైగా పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారు.మంగళవారం సెషన్‌లో కూడా మూరత్ ట్రేడింగ్ సందర్భంగా ఈ స్టాక్ పుంజుకుంది. ఇంట్రాడేలో 3 శాతానికిపైగా పెరిగి రూ. 4,350.60 వద్ద జీవన కాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 2 శాతం లాభంతో రూ. 4,290 వద్ద సెషన్ ముగించింది. ఇక ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 17.32 వేల కోట్లుగా ఉంది. గత 5 రోజుల వ్యవధిలోనే ఈ స్టాక్ ధర 23 శాతానికిపైగా పెరిగింది. 6 నెలల్లో 40 శాతానికిపైగా పుంజుకుంది.