Lieutenant Colonel Rank to Neeraj Chopra: ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రాకు దేశం అత్యంత అరుదైన గౌరవాన్ని అందించింది. జావెలిన్ సూపర్ స్టార్‌గా పేరొందిన నీరజ్ చోప్రాకు భారతీయ సైన్యం గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకును అందజేసింది. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని ఆయనకు ప్రకటించారు. ఈ ర్యాంకుతో నీరజ్ చోప్రాను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సన్మానించారు. ఈ అద్భుతమైన ఈవెంట్‌ను నీరజ్ చోప్రా కుటుంబ సభ్యులు కూడా ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం.ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ నీరజ్ చోప్రా.. పట్టుదల, దేశభక్తికి నిదర్శనం అని అన్నారు. ఆయన క్రీడా విజయాలు అసాధారణమైనవని.. అవి దేశానికి ఎంతో గర్వకారణమని కీర్తించారు. రాబోయే తరాలకు నీరజ్ చోప్రా స్ఫూర్తిగా నిలుస్తారని, పట్టుదలకు, క్రమశిక్షణకు ఆదర్శప్రాయుడని మంత్రి కొనియాడారు.నీరజ్ చోప్రా 2016 ఆగస్టులో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా, నాయిబ్ సుబేదార్ ర్యాంకుతో భారతీయ సైన్యంలో చేరి దేశ సేవకు అంకితమయ్యారు. 2021లో మేజర్‌గా పదోన్నతి పొందారు. ఆయనకు ఇప్పటికే అనేక అత్యున్నత అవార్డులు దక్కాయి. ఆయన 2022లో పద్మశ్రీ, 2021లో భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా సైన్యంలో ఆయన సేవలకు గాను 2022లో పరమ విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ కూడా గెలుచుకున్నారు.అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించారు. అథ్లెటిక్స్‌లో భారత దేశానికి మొట్టమొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించారు. 2024 పారిస్ ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించారు. 2023 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లలోనూ ఆయన స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా తన జావెలిన్‌ను అత్యుత్తమంగా 90.23 మీటర్ల దూరం విసిరి వ్యక్తిగత రికార్డును నెలకొల్పారు. క్రీడల్లో ఆయన సాధించిన అపార విజయాలు, దేశభక్తిని గుర్తించి భారత సైన్యం ఈ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించింది.