Cash Limit: స్మార్ట్ ఫోన్ ద్వారానే సకల పనులు పూర్తవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలు పెరిగాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వచ్చిన తర్వాత చిన్న పేమెంట్ల నుంచి రూ.1 లక్ష ఆపైన పేమెంట్లు సైతం ఫోన్ ద్వారానే చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. అయితే, ఇలాంటి సమయంలోనూ నగదు ట్రాన్సాక్షన్లూ పెరిగాయి. ఒకరి నుంచి ఒకరు నేరుగా నగదు తీసుకుని వివిధ లావాదేవీలు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీల విషయంలో ఆదాయపు పన్ను శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. వ్యక్తిగత ఉపయోగం లేదా వ్యాపారపరమైన పనుల కోసం నగదు స్వీకరించేందుకు పరిమితి విధించింది. మరి ఆ లిమిట్ ఏమిటి? అంతకు మించి డబ్బు నేరుగా తీసుకుంటే ఎంత జరిమానా వేస్తారు? అనే వివరాలు తెలుసుకుందాం. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్స్ 1961లోని సెక్షన్ 269ST ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో రూ.2 లక్షలు లేదా అంతకు మించి నగదు స్వీకరించకూడదు. ఈ లిమిట్ అందరికీ వర్తిస్తుంది. వ్యక్తిగతంగా లేదా వ్యాపార పరంగానూ రూ.2 లక్షలకు మించి నగదు స్వీకరించకూడదు. ఉదాహరణకు ఏదైనా వాహనం, వస్తువు విక్రయించినప్పుడు దాని విలువ రూ.2 లక్షలు ఆపైన ఉంటే నేరుగా డబ్బుల రూపంలో తీసుకోవడం చట్టవిరుద్ధం. రూ. 2 లక్షలకు మించి డబ్బులు తీసుకుంటే ఆదాయపు పన్ను విభాగం అంతే మొత్తంలో జరిమానా విధించేందుకు అవకాశం ఉంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వ్యాపార లావాదేవీల కోసం రూ. 5 లక్షలు తీసుకున్నారు అనుకుందాం. ఇలా రూ. 2 లక్షలకు మించి డబ్బు నేరుగా తీసుకున్నారు కాబట్టి రూ.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. సెక్షన్ 271 DA కింద ఈ జరిమానా విధిస్తారు. ట్రాన్సాక్షన్ నిర్వహించినప్పుడు నగదు తీసుకున్న వ్యక్తి జవాబుదారిగా ఉండాల్సి వస్తుంది. . రూ. 2 లక్షలకు మించి నగదు ట్రాన్సాక్షన్లు నిర్వహించకూడదని పేర్కొంది. పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్ల కోసం బ్యాంకు చెక్కులు, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటివి ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అన్ని వివరాలు పారదర్శకంగా ఉంటాయని ఐటీ శాఖ చెబుతోంది. తమ స్నేహితులు, బంధువులకు ఇచ్చే డబ్బులు సైతం రూ. 2 లక్షలకు మించి ఉండకూడదు.