మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలకు కింగ్ , అమల దంపతులు, విక్టరీ వెంకటేష్ దంపతులు హాజరయ్యారు. వీరితో పాటుగా హీరోయిన్ నయనతార కూడా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఆప్త మిత్రులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పోస్ట్ పెట్టారు. ''నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్.. నా కోస్టార్ నయనతార మా ఫ్యామిలీతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. జీవితాన్ని ప్రకాశవంతంగా చేసే ప్రేమ, చిరు నవ్వులు, ఐక్యతను గుర్తు చేస్తాయి'' అని చిరంజీవి ఎక్స్ లో పేర్కొన్నారు. చిరు, నాగ్, వెంకీ మామ కలిసి ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డప్పటికీ, రియల్ లైఫ్ లో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. తరచుగా కలుస్తుంటారు.. ఫ్యామిలీస్ తో కలిసి వెకేషన్ కి వెళ్తుంటారు. ఇప్పుడు దీపావళి పండగను పురష్కరించుకుని కొణిదెల వారి ఇంట కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పిల్లర్స్ లాంటి ఈ ముగ్గురి మధ్య బాండింగ్ ఈతరం హీరోలకు కూడా ఆదర్శం అని చెప్పాలి. వీరితో పాటుగా నందమూరి బాలకృష్ణ కూడా ఉంటే పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.