సాధారణంగా ఎవరైనా భూమి అమ్మాలంటే.. ఎకరాకు ఎంతో కొంత చొప్పున రేటు ప్రకటిస్తారు. భూమి కొనుగోలు చేయాలి అనుకునే వారు.. ఆ రేటుకు బేరం ఆడి ఎంతో కొంత తగ్గించి.. కొనుగోలు చేస్తుంటారు. ఎక్కడైనా భూ విక్రయాల్లో జరిగేది ఇదే. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. తన 4 ఎకరాల భూమిని విక్రయించేందుకు కొత్త పద్దతిని ఎంచుకున్నాడు. లక్కీ డ్రా పద్దతిలో తన భూమిని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి.. అన్ని రకాల ఆఫర్లు, షరతులతో కూడిన ఫ్లెక్సీని తన పొలానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేయగా.. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లా కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు ఈ వినూత్న ఆలోచనకు తెరతీశాడు. తనకు ఉన్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టేకులపల్లి గ్రామ శివారులో అతడికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ భూమిని లక్కీ డ్రా పెట్టాడు. భూమిని సొంతం చేసుకోవాలని భావించే వారు ఎవరైనా సరే రూ.10 వేల నగదు చెల్లించాలని పేర్కొన్నాడు. డబ్బులు చెల్లించిన వారికి ఒక టోకెన్‌ ఇస్తామని వెల్లడించాడు. అయితే ఈ లక్కీ డ్రా తీసే తేదీ మాత్రం ముందుగా ప్రకటించలేదు. డబ్బులు చెల్లించిన వారు మొత్తం 1500 మంది కాగానే అప్పుడు అందరి సమక్షంలో ఆ లక్కీ డ్రా తీస్తానంటూ షరతు పెట్టాడు. ఇక ఈ విషయాలన్నింటితో కూడిన పెద్ద ఫ్లెక్సీని తన చేనుకు వెళ్లే దారిలో ఏర్పాటు చేశాడు. దీంతో అది చూసిన స్థానికులు ఆ ఫ్లెక్సీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. అందులో ఆ భూమి సర్వే నంబర్లతోపాటు రూట్‌ మ్యాప్, పూర్తి వివరాలను వెల్లడించాడు. అయితే ఈ లక్కీ డ్రా ద్వారా ఆ భూమికి స్థానికంగా ఉన్న మార్కెట్‌ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఇక లక్కీ డ్రాలో పాల్గొనేవారు.. రూ.10 వేలు చెల్లించేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి పేమెంట్స్ యాప్‌‍ల ద్వారా కూడా చెల్లించవచ్చని ఆ రైతు వెల్లడించాడు. అందుకోసం అందులో తన ఫోన్‌ నంబర్‌ను కూడా పేర్కొన్నాడు. అయితే ఈ ఆఫర్‌పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్కీ డ్రా తీసే తేదీని ముందే ప్రకటించకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. 1500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు.. లక్కీడ్రా తీసేదెప్పుడు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక భూమిని డైరెక్ట్‌గా అమ్మకుండా ఇలా లక్కీ డ్రా ఏర్పాటు చేసి.. విక్రయించడానికి గల కారణాన్ని కూడా ఆ రైతు భీమేష్ వెల్లడించాడు. తాను తన సొంత అవసరాల కోసం భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. అయితే అందుకు సరైన ధర రావడం లేదని వాపోయాడు. అందుకే ఇలా లక్కీ డ్రా పద్దతిని ఆలోచన చేసినట్లు వెల్లడించాడు. ఇక ఈ లక్కీ డ్రా నిర్వహించేందుకు ఇప్పటివరకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్‌ తొలి వారంలో లక్కీ డ్రా తీసే తేదీని ప్రకటిస్తానని రైతు భీమేష్ తెలిపాడు.