తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. రాబోయే 20 గంటల్లో ఈ జిల్లాల్లో కుండపోత..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 20 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ఆదివారం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు కారణంగా కురుస్తాయని అధికారులు తెలిపారు. క్యూమునోలింబస్ మేఘాల కారణంగా 20 గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా, రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వీచే అవకాశం ఉందని చేసింది. గత 24 గంటలలో.. నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఈ అసాధారణ వాతావరణ మార్పుల దృష్ట్యా.. ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకునేటప్పుడు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహనాలను నడిపేవారు అతి వేగాన్ని తగ్గించి.. ట్రాఫిక్ సెంటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రహదారులపై, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉన్నందున, ప్రయాణ సమయాల్లో ఆలస్యం జరగవచ్చు. చెట్లు లేదా బలహీనమైన నిర్మాణాల కింద వాహనాలను నిలపకుండా ఉండటం ఉత్తమం. మరోవైపు.. మత్స్యకారులు, పశుపోషకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. నదులు, చెరువులు, రిజర్వాయర్ల పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు పశువులను సురక్షిత ప్రాంతాలలో ఉంచుకోవాలి. చేపల వేటకు దూరంగా ఉండటం, లోతట్టు జలమయ ప్రాంతాలకు వెళ్లకపోవడం శ్రేయస్కరం. సాధారణ ప్రజలు కూడా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.