సముద్రం అడుగున కళ్లుచెదిరే నిధి.. కోట్ల విలువైన బంగారం, వెండి నాణేలు లభ్యం

Wait 5 sec.

వందల ఏళ్ల కిందట సముద్రంలో ఓడలు, నౌకలు మునిగిపోయిన ప్రాంతాల్లో నిధులు కోసం అన్వేషణలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా, ఓ అన్వేషణ టీమ్‌ వెండి, బంగారం, వజ్రాలతో కూడిన నిధిని వెలికితీసింది. శతాబ్దాల కిందట సముద్రంలో మునిగిపోయిన స్పెయిన్ ఓడల్లోని ఈ సంపద విలువ 10 లక్షల డాలర్లుగా ఉంటుందని అంచనా. అమెరికాలోని ఫ్లోరిడా సమీపంలోని అట్లాంటిక్‌ తీరంలో ఓ సంస్థ తరఫున వెళ్లిన డైవర్ల బృందానికి ఈ నిధి దొరికింది. ఇందులో మొత్తం 1,000 బంగారు, వెండి నాణేలు ఉండగా.. నాటి స్పెయిన్ పాలనలో ఉన్న బొలీవియా, మెక్సికో, పెరులకు చెందిన ముద్రలతో ఉన్నాయి. మూడు వందల సంవత్సరాలు సముద్రంలో ఉన్నా ఇప్పటికీ ఆ ముద్రలు స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. స్పెయిన్‌ నుంచి బయలుదేరిన నౌకల్లో కొన్ని న్యూ వరల్డ్‌ నుంచి వెనక్కి వచ్చాయి. ఈ క్రమంలో 1715 జులై 31న సంభవించిన పెను తుపానులో ఆ ఓడలు చిక్కుకుని ధ్వంసమయ్యాయి. అందులోని సంపద సహా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. ఆ సంపద విలువ దాదాపు 40 కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.3,550 కోట్లు ఉంటుందని అంచనా. ఫ్లోరిడాలోని టర్కోయిజ్‌ జలాల్లో ఉన్న ఆ ప్రదేశాన్నే ‘ట్రెజర్‌ కోస్ట్‌’‌గా పిలుస్తారు. ఇటీవల సాల్వేజ్ సంస్థ అన్వేషణ కోసం తన డైవర్ల బృందాన్ని పంపపడంతో ఆ నిధి బయటపడింది. ఈ టీమ్‌లోని లెవిన్‌ షేవర్స్‌ అనే డైవర్‌ బంగారు, వెండి నాణేలను కనుగొన్నారు. అయితే, అక్కడ నిధి దొరకడం ఇదే మొదటిసారి కాదు. 1715 ఫ్లీట్‌కు చెందిన డైవర్లు మిలియన్ల డాలర్ల బంగారు నాణేలను మెల్‌బోర్న్ నుంచి ఫోర్ట్ పియర్స్ వరకు విస్తరించి ఉన్న తీరప్రాంతంలో అనేక ఏళ్లుగా కనుగొన్నారు.ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) సాల్ గుట్టుసో మాట్లాడుతూ.. ‘ఈ అన్వేషణ కేవలం ఆ నిధి గురించే కాదు, అది చెప్పే చరిత్ర కథల గురించీ కూడా’ అని ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రతి నాణెం ఒక చరిత్ర భాగం స్పానిష్ సామ్రాజ్యపు స్వర్ణయుగం నాటి ప్రజలతో అనుసంధానమైన స్పష్టమైన ఆధారం. అయితే, ఒకేసారి 1,000 నాణేలు దొరకడం అంటే అది అత్యంత అరుదైందే కాదు అద్భుతమైన సంఘటన కూడా’ అని ఆయన పేర్కొన్నారు.ఆ సంస్థ డైవింగ్ బృందాలను, నౌకాదళాన్ని అద్దెకు తీసుకుంటుంది. సముద్ర గర్భంలో ఉన్న వస్తువులను గుర్తించడానికి అండర్‌వాటర్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగిస్తారు. అలాగే డైవర్స్ చేతులతో ఇసుకను తవ్వడానికి శోషణ పరికరాలను ఉపయోగించడం ద్వారా సముద్ర తీరాన్ని పరిశీలిస్తారని ఆ సంస్థ సమర్పించిన ఫెడరల్ అనుమతి దరఖాస్తులో తెలిపింది.గతేడాది ఫ్లోరిడా అధికారులు శిధిలాల నుంచి తస్కరించిన వాటిలోని పదులు సంఖ్యలో నాణేలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. ఆ ఘటనలో ప్రధాన నిందితుడు, 1715 ఫ్లీట్ క్వీన్స్ జువెల్స్ ఎల్‌ఎల్‌సీ (Queens Jewels LLC) అనే సంస్థకు కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న బృందంలోని సభ్యుడేనని అధికారులు తెలిపారు.