కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. బిహార్‌లోని అన్ని స్థానాల్లో ఆప్ పోటీ, 11 మందితో తొలి జాబితా

Wait 5 sec.

10 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. ఢిల్లీతోపాటు పంజాబ్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుని.. జాతీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ సహా పార్టీలోని కీలక నేతలు ఘోర ఓటమిని చవిచూసి.. ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే అధికారం ప్రస్తుతం పంజాబ్‌కే పరిమితం కాగా.. తాజాగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం రోజున బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలోని అన్ని స్థానాలు (243) పోటీ చేయనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే 11 మంది ఆప్ అభ్యర్థులతో తొలి జాబితాను కూడా ఆ పార్టీ విడుదల చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో అందించిన పాలనా విధానాలను బిహార్‌లోనూ అమలు చేస్తామని ఆ రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ అజేశ్‌ యాదవ్ వెల్లడించారు. అభివృద్ధి, పాలనకు సంబంధించి తమ వద్ద సక్సెస్‌ఫుల్ ఫార్ములా ఉందని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన పనులు దేశవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు పూర్వాంచల్ ప్రాంత ప్రజలు సహకరించారని.. ఇప్పుడు బిహార్‌లోనూ తమ పార్టీకి అండగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు ఆప్ నేషనల్ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ విశ్వాసం వ్యక్తం చేశారని అజేశ్‌ యాదవ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని.. ఆప్ రాష్ట్ర సహాయక ఇంఛార్జ్ అభినవ్ రాయ్ వెల్లడించారు. తమకు ప్రజలతోనే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. ఇతర పార్టీలతో గానీ.. ఏదైనా కూటమితో గానీ కలిసి పోటీ చేసే అవకాశాలు లేవని కొట్టిపారేశారు. జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇప్పుడిప్పుడే సంస్కరణల గురించి మాట్లాడటం మొదలు పెట్టారని.. అయితే తాము వాటిని ఇప్పటికే క్షేత్రస్థాయిలో అమలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.మరోవైపు.. రెండు విడతల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడత నవంబర్ 6.. రెండో దశ నవంబర్ 11న జరగనుండగా.. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. మొత్తం బిహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 90 వేలకుపైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక బిహార్‌లో 7.43 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 3.92 కోట్ల మంది పురుషులు.. 3.50 కోట్ల మహిళలు ఉన్నారు.