కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'కాంతార చాప్టర్ 1'. ఇది 2022లో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. అంతకముందు రోజు ప్రదర్శించిన ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో చేరిపోయింది. 'కాంతార చాప్టర్ 1' సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు రూ.61 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. మూడో రోజు రూ.81 గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం ఈ మూవీ 3 రోజుల్లో రూ.230 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో ప్రస్తుతానికి నాలుగో స్థానంలో నిలిచింది. నాలుగో రోజు ఆదివారం దాదాపు అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. రూ. 80-90 కోట్లు రావొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఫస్ట్ వీకెండ్ లోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరుతుంది.'కాంతార చాప్టర్ 1' సినిమా కన్నడలో పాటుగా తెలుగు తమిళం మలయాళ హిందీ భాషల్లో విడుదలైంది. ఓవర్ సీస్ లో ఇప్పటికే $2 మిలియన్ల డాలర్స్ క్లబ్ లో చేరిపోయింది. కేరళలో మూడు రోజుల్లో రూ.16.20 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ 3 రోజుల్లో రూ.52 కోట్లు కలెక్ట్ చేసింది. బుక్ మై షోలో ఈ చిత్రానికి 5 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని, డివైన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని, ప్రతిచోటా హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ట్రెండ్ చూస్తుంటే మరికొన్ని రోజులు కాంతార ఊచకోత ఇలానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'కాంతార చాప్టర్ 1'చిత్రంలో రిషబ్ శెట్టితో పాటుగా రుక్మిణీ వసంత్‌, గుల్షన్‌ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. దైవిక అంశాలతో గిరిజన సంస్కృతి, త్యాగం మిళితమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రిషబ్‌ శెట్టి దర్శకుడిగా, నటుడిగా మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. రుక్మిణీ వసంత్‌ తన పాత్రతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రొడక్షన్‌ డిజైన్‌, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హొంబాలే ఫిల్మ్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది.