ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్ రావడం ఖాయమైంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో విమానాశ్రయంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. విషయంలో ఉన్న అపోహలు వదిలి అభివృద్ధికి సహకరించాలని ఆయన రైతులను కోరారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశం జరిగింది. నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.. పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే శిరీష, అధికారులు, నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలాసలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రులు వివరించారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాల రైతులు విమానాశ్రయానికి మద్దతు తెలిపారు. అయితే తమను ఎలా ఆదుకుంటారో చెప్పాలని వారు కోరారు. తమకు స్పష్టమైన హామీలు కావాలన్నారు రైతులు. బిడిమి, మెట్టూరు, చీపురుపల్లి, భేతాళపురం, లక్ష్మీపురం గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పారు. భూమికి మంచి ధర ఇవ్వాలని వారు కోరారు. స్థానికులకు ఉద్యోగాలు కావాలని అడిగారు. భూమి మొత్తం కోల్పోయిన వారికి అదనపు సహాయం చేయాలన్నారు. ఏ గ్రామంలో ఎంత భూమి అవసరమో స్పష్టంగా చెప్పాలన్నారు. రైతులు తమ సమస్యలు, డిమాండ్లు చెప్పారు. భూమి ధర, స్థానిక ఉపాధి, అదనపు సహాయం గురించి చర్చించారు. ఇటు రైతుల అభిప్రాయాలు విన్నారు, నమోదు చేసుకున్నారు. మందస మండలం కార్గో విమానాశ్రయం నిర్మాణానికి అనువైనదని ఏవియేషన్‌ అధికారులు సూచించారన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు. ఆ ఎయిర్‌పోర్ట్ వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇక్కడే లభిస్తాయన్నారు. భూములు నష్టపోతున్న రైతుల వివరాలు తెలుసుకోవడానికి అధికారులు వెళ్లారని.. కానీ కొంతమంది వారిని అడ్డుకుని వెనక్కి పంపించారని మంత్రి గుర్తు చేశారు. ఈ కొత్త కార్గో విమానాశ్రయ నిర్మాణంతో దాదాపుగా 5 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారని వివరించారు. అభివృద్ధి లేకుండా ఉద్యోగావకాశాలు ఎలా ఇస్తారో రైతులని రెచ్చగొట్టేవారిని ప్రశ్నించాలన్నారు. రైతులకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఆలోచనలు చేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఎయిర్‌పోర్ట్ కోసం సర్వేకు సహకరించాలని అచ్చెన్నాయుడు రైతులను కోరారు. కార్గో విమానాశ్రయానికి సహకరిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో సభలు పెట్టి, అందరి ఆమోదంతోనే పనులు మొదలు పెడతామన్నారు. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో మరో కొత్త కార్గో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కాబోతోంది.'ఈ రోజు పలాసలో ఉద్దానం ఎయిర్‌పోర్ట్ అవగాహన సభను గ్రామస్థులు, రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించాం. పలాసా సమీపంలో ప్రతిపాదిత విమానాశ్రయం పట్ల ప్రజలలో సానుకూలత చూసి సంతోషంగా అనిపించింది. ఇది ఉద్దానం ప్రాంతానికి అభివృద్ధి, కనెక్టివిటీ, అవకాశాలకు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది. ప్రజలు తెలిపిన ప్రతి సూచన, అభిప్రాయాన్ని జాగ్రత్తగా విన్నాం. ప్రజా విశ్వాసం, భాగస్వామ్యంతో పారదర్శకంగా ప్రతీ అంశాన్ని పరిష్కరించడం జరుగుతుంది' అన్నారు. 'ఉద్దానం ఎయిర్‌పోర్ట్ కేవలం మౌలిక సదుపాయ ప్రాజెక్టు మాత్రమే కాదు ఇది ఉపాధి, పర్యాటకం, పరిశ్రమలు, ఆర్థిక అభివృద్ధికి దారితీసే కొత్త అవకాశాల కేంద్రం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, పలాసా ఎమ్మెల్యే గౌతు శిరీష గారు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు, ఎస్పీ మహేశ్వరరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ ఫర్హ్మాన్ అహ్మద్ గారు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు' అని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.