తిరుమలలో కుండపోత వర్షం.. రాష్ట్రంలో 3 రోజల పాటు వానలు.. ఆ 3జిల్లాలకు రెడ్ అలర్ట్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. రెండు రోజులుగా పలు జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. ఇదిలా ఉంటే శనివారం నాడు తిరుమలలో కుండపోత వాన కురిసింది. తెల్లవారుజాము నుంచే ఎడతెరపి లేని వర్షం కురవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో దర్శనం తర్వాత గదులకు వెళ్లేందుకు, లడ్డూ కేంద్రాలకు వెళ్లడానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వర్షం ప్రభావంతో తిరుమలలో చలి ప్రభావం పెరిగింది. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 4 గంటల పాటు వర్షం కురిసింది. తెల్లవారుజామున 4.30 నుంచి ఉదయం 8.30గంటల వరకు భారీ వర్షం కురిసింది. కాసేపు విరామం తర్వాత మరో 4 గంటల పాటు మోస్తరు వర్షం కురిసింది. మొత్తం మీద శనివారం నాడు తిరుపతిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ వానతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. లక్ష్మీపురం జంక్షన్‌లో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అధికారులు మోటర్ల సాయంతో నీటిని పంపింగ్ చేరు. తమిళనాడు తీరం వెంట బంగాళాఖాతలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ఫలితంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. దీంతో ఈ మూడు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలానే అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలానే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలానే ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో మోస్తురు నుంచి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. రెండు మూడు చోట్ల చిరు జల్లులు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో కూడా నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలానే రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షం పడే సమయంలో బయటకు రావద్దని సూచించారు.