గిల్ కెప్టెన్ అవుతాడని రోహిత్ 13 ఏళ్ల క్రితమే చెప్పాడా? హిట్‌మ్యాన్ పాత పోస్ట్ వైరల్‌..!

Wait 5 sec.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ను బీసీసీఐ మార్చింది. ఈ మేరకు ప్లేసులో 26 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసింది. అయితే ఈ నిర్ణయంపై హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. భారత జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించిన రోహిత్‌ను.. ఇలా అర్ధాంతరంగా తప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. రోహిత్ నీడలో.. గిల్ నాయకుడిగా ఎదుగుతాడని అందుకు ఇదే సరైన సమయమని పేర్కొంటున్నారు. ఇక కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో రోహిత్ శర్మ 13 ఏళ్ల క్రితం చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.2012 సెప్టెంబర్ 14న రోహిత్ శర్మ ఓ ట్వీట్ చేశాడు. “ఒక శకం (45) ముగింపు.. కొత్త శకం ప్రారంభం (77)” అని హిట్‌మ్యాన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో 45, 77 నంబర్‌ల కారణంగా ఈ పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నంబర్‌లకు ప్రస్తుత పరిణామాలతో సరిగ్గా సరిపోవడం గమనార్హం. సాధారణంగా రోహిత్ శర్మ జెర్సీ 45 ధరిస్తాడు. ఐపీఎల్‌ అయినా.. అంతర్జాతీయ క్రికెట్ అయినా.. అతడి జెర్సీ నంబర్ మాత్రం 45. అయితే గిల్ ధరించె జెర్సీ నంబర్ 77. అంటే రోహిత్ శర్మ తన ట్వీట్‌లో పేర్కొన్న రెండు నంబర్లు ఇవే. దీంతో రోహిత్ శర్మ.. శుభ్‌మన్ గిల్‌ టీమిండియా కెప్టెన్ అవుతాడని ముందే ఊహించాడనే ప్రచారం జరుగుతోంది.రోహిత్ ఆ పోస్టు ఎందుకు పెట్టాడంటే..2012లో టీ20 ప్రపంచకప్‌కు ముందు కొన్ని కారణాల వల్ల రోహిత్ తన జెర్సీ నంబర్‌ను మార్చుకున్నాడు. తాను సాధారణంగా ధరించే 45 నంబర్ కాకుండా, కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా 77 నంబర్ జెర్సీ ధరించాడు. ఆ సమయంలో తన ఆటతీరు బాగోలేకపోవడం, జట్టులో సుస్థిర స్థానం లేకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని, తన పాత ఫామ్ ముగిసి, కొత్త ఫామ్ మొదలవుతుందనే ఉద్దేశంలో హిట్‌మ్యాన్ ఆ పోస్టు పెట్టాడు. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకు మళ్లీ 45 నంబర్‌ జెర్సీనే ధరించాడు. ఇక 13 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ (45 జెర్సీ నంబర్‌)ను తప్పించి శుభ్‌మన్ గిల్‌ (జెర్సీ నంబర్ 77)ను బీసీసీఐ కెప్టెన్‌గా చేయడంతో పాత పోస్టు వైరల్‌గా మారింది.