ఫైటర్ జెట్ ఇంజిన్ల విషయంలో రష్యా-పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది అని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై దేశ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. ప్రతిపక్ష పార్టీలు.. అధికార పక్షంపై దుమ్మెత్తిపోశాయి. అయితే తాజాగా ఈ విషయంపై రష్యా క్లారిటీ ఇచ్చింది. తాము పాకిస్థాన్‌తో అలాంటి ఒప్పందమేదీ చేసుకోలేదని.. భారత్‌కు ఇబ్బందికరంగా అనిపించేంత పెద్ద ఒప్పందాలను తాము పాకిస్థాన్‌తో చేసుకోలేదని స్పష్టం చేసింది. భారత్‌కు ఇబ్బందికరంగా మారే చర్యలు తాము చేపట్టబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారాన్ని ఉటంకిస్తూ.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. పాక్‌తో మాకు అంత ఫ్రెండ్‌షిప్ లేదు!"(పాకిస్థాన్‌తో) అలాంటి ఒప్పందం జరిగినట్లు ఎలాంటి ఆధారం లేదు. రానున్న కొద్ది రోజుల్లో రష్యా, భారత్‌ మధ్య పెద్ద ఒప్పందాలను జరుగుతాయని విశ్లేషించే పరిశీలకులకు.. ఈ వార్తల్లో లాజిక్ కనిపించదు. భారత్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేంత పెద్ద ఒప్పందం పాకిస్తాన్‌తో రష్యా చేసుకోలేదు. పాక్‌తో ఆ స్థాయి సహకారం లేదు. భారత్, రష్యాల మధ్య చాలా ఉన్నత స్థాయిలో పరిచయాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో ఇరు దేశాల సహకారాన్ని చెడగొట్టేలా ఎవరో ప్రయత్నాలు చేస్తున్నారు" అని క్రెమ్లిన్ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.పాకిస్థాన్‌ యుద్ధ విమానాల కోసం రష్యా ఇంజిన్లను సరఫరా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పాక్‌లో ఉన్న చైనా తయారీ JF-17 బ్లాక్ 3 ఫైటర్ జెట్లలో.. వాడే ఇంజిన్లను రష్యా సరఫరా చేస్తోందని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తలు దేశంలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి.బీజేపేపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా చెబుతారని.. కానీ ఆ దేశం మన శత్రువుకు మద్దతునిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపణలు గుప్పించారు. మోదీది వ్యక్తిగతమైన దౌత్యం అని ఎద్దేవా చేశారు. మండిపడ్డారు. ఆయన జాతీయ ప్రయోజనాలకంటే తనకు పేరు వచ్చే విషయాలకే ప్రాధాన్యతనిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రష్యా ఎందుకు పాక్‌కు సహకారాన్ని అందిస్తుందో ప్రభుత్వం చెప్పితీరాలన్నారు.భారత్‌కు పుతిన్... ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందాలు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలను చెడగొట్టడానికే ఇలాంటి ప్రయత్నాల జరుగుతున్నాయి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారత్ పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని.. స్నేహితుడు, విశ్వసనీయ భాగస్వామి ప్రధాని మోదీని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని అన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇబ్బంది కలిగేలా రష్యా చేయదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.