తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కీలక మార్పులు చేసింది. లబ్ధిదారులకు తీపి కబురు చెబుతూ.. ఈ పథకాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయంతో పాటు, అదనంగా 90 రోజుల పని కల్పించనుంది. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అందించే రూ.5 లక్షల ఆర్థిక సహాయం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. ఉపాధి హామీ అనుసంధానం ద్వారా, జాబ్‌కార్డున్న లబ్ధిదారులకు రోజుకు రూ.307 చొప్పున కూలీ లభిస్తుంది. ఈ విధంగా గరిష్ఠంగా 90 రోజులకు రూ.27,630 వారి ఖాతాల్లో అదనంగా జమ చేస్తారు. దీంతో పాటు, స్వచ్ఛభారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించుకుంటే మరో రూ.12 వేల ఆర్థిక సహాయం కూడా అందుతుంది.ఉపాధి హామీ కింద కల్పించే 90 రోజుల పనిదినాలను ఇంటి నిర్మాణంలోని దశల ఆధారంగా కేటాయిస్తారు. ఇంటి బేస్‌మెంట్ స్థాయి వరకు 40 రోజులు, లెంటల్ స్థాయి వరకు 30 రోజులు, నిర్మాణం పూర్తయ్యాక 20 రోజుల పనిని కల్పిస్తారు. ఒకవేళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బేస్‌మెంట్ వరకు పనులు పూర్తయితే.. మిగిలిన పనిదినాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించేందుకు వెసులుబాటు కల్పించారు.వేతనాల చెల్లింపుల కోసం, నిర్మాణ పనుల్లోని మూడు స్థాయిల్లో లబ్ధిదారుడి చిత్రాలు తీసుకొని వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. నిర్మాణం పూర్తైన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించగానే లబ్ధిదారు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అయితే ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పనులు మినహా ఇతర ఉపాధి హామీ పనులు కేటాయించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.సెప్టెంబరు 15న వచ్చిన ఆదేశాల మేరకు అధికారులు పరిశీలించగా.. చాలా మంది లబ్ధిదారులకు ఇప్పటికే జాబ్‌ కార్డులు ఉన్నట్లు తేలింది. జాబ్‌ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించేలా చర్యలు తీసుకుంటారు. కొత్తగా పెళ్లయిన మహిళకు ఇల్లు మంజూరైతే.. అప్పటికప్పుడు ఎంపీడీవో ద్వారా జాబ్‌ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలతో ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తవడంతో పాటు, పేద ప్రజలకు అదనపు ఆర్థిక భరోసా లభిస్తుంది.