IPO: ఈ వారం స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి నెలకొననుంది. దసరా పండగ తర్వాత ఇన్వెస్టర్లకు పండగ వచ్చిందని చెప్పవచ్చు. వీటితో పాటు మరికొన్ని కంపెనీల ఐపీఓలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వారంలో సబ్‌స్క్రిప్షన్ కొనసాగించున్నాయి. మరి ఆయా కంపెనీల ఐపీఓల గురించిన వివరాలు తెలుసుకుందాం. టాటా గ్రూప్ నుంచి భారీ ఇష్యూటాటా గ్రూప్ సంస్థ టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 6వ తేదీ మొదలై 8వ తేదీ వరకు కొనసాగనుంది. మార్కెట్ నుంచి రూ.15,512 కోట్లు సమీకరించే లక్ష్యంతో వస్తోంది. 21 కోట్ల తాజా షేర్లు జారీ చేయనున్నారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయిస్తారు. ఈ పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరు ధర రూ.310-326 మధ్య నిర్ణయించారు. కనీసం ఒక లాట్ కోసం బిడ్లు వేయాలి. ఒక్క లాట్‌లో 46 షేర్లు ఉంటాయి. అంటే కనీసం రూ.14,996 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. టాటా గ్రూప్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ విలువ రూ.1.38 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ 3.58 కోట్ల షేర్లు విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీలో టాటా సన్స్‌కు 88.6 శాతం, ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది. అక్టోబర్ 13వ తేదీన స్టాక్ మార్కెట్లో షేర్లు లిస్టింగ్ కానున్నాయి. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ రూ.11,607 కోట్లు సమీకరించనుంది. అక్టోబర్ 7వ తేదీన మొదలై 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధర రూ.1080-1140గా నిర్ణయించారు. కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేయాలి. అంటే రూ.14,820 కనీస పెట్టుబడిగా నిర్ణయించారు. ఈనెల 14వ తేదీన షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అవుతాయి. గత ఏడాది హ్యూందాయ్ మోటార్స్ ఇండియా భారత మార్కెట్లలో లిస్ట్ అయింది. ఇప్పుడు రెండో కొరియన్ సంస్థగా ఎల్‌జీ ఇండియా నిలుస్తోంది. ఈ కంపెనీ విలువ రూ.77,400 కోట్లుగా లెక్కగట్టారు. అలాగే రుబికాన్ రీసెర్చ్ ఐపీఓ ద్వారా రూ.1377.5 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమవుతోంది. దీంతో పాటు వుయ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ కంపెనీ రూ.3000 కోట్ల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే మొదలైంది. వీటితో పాటు ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో కెనరా హెచ్ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓ వస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 23.75 కోట్ల షేర్లను జారీ చేయనుంది.