పై భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక పోరు లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్‌కు చేరనుంది. గ్రూప్ దశ నుంచి సూపర్-8 వరకు అజేయంగా సాగుతున్న దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గ్రూప్ దశలోనే న్యూజిలాండ్‌ను ఓడించిన సఫారీలు, సూపర్-8లో భారత్‌పై గెలిచి తమ బలాన్ని నిరూపించారు.మరోవైపు న్యూజిలాండ్ ప్రయాణం కొంత ఒడిదుడుకులతో సాగింది. గ్రూప్ దశలో మూడు విజయాలు, ఒక ఓటమితో ముందుకు వచ్చిన కివీస్, సూపర్-8లో శ్రీలంకపై గెలిచి, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడం కూడా వారి మార్గాన్ని ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు అభిమానుల్లో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఈ సెమీఫైనల్ మ్యాచ్ వర్షంతో పూర్తిగా రద్దయితే ఏమవుతుంది?ఐసీసీ నిబంధనల ప్రకారం, సూపర్-8 దశలో రిజర్వ్ డే లేకపోయినా సెమీఫైనల్ - ఫైనల్ మ్యాచ్‌లకు అదనపు సమయం కేటాయించారు. నిర్ణీత రోజున మ్యాచ్ పూర్తి చేయడానికి అధికారులకు అదనంగా 90 నిమిషాల సమయం ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో నిలిచిపోతే, మరుసటి రోజు రిజర్వ్ డే అయిన మార్చి 5న, ఆగిన చోట నుంచే మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. అంటే మొదటినుంచి కొత్తగా మ్యాచ్ ఆడరు.అయితే ప్రధాన రోజు, రిజర్వ్ డే రెండింటిలోనూ ఒక్క బంతి కూడా పడకపోతే అప్పుడు సూపర్-8 ర్యాంకింగ్స్ ఆధారంగా ఫైనలిస్ట్‌ను నిర్ణయిస్తారు. బౌల్-అవుట్ లేదా టాస్ వంటి పద్ధతులు ఉండవు. ఈ టోర్నీలో సూపర్-8 గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇక గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్ మూడు పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరింది. అందువల్ల, మ్యాచ్ పూర్తిగా రద్దయితే నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికానే నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.దీంతో వర్షం పడితే న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. మ్యాచ్ జరగాలని, మైదానంలోనే విజేత తేలాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈడెన్ గార్డెన్స్‌లోనే వెస్టిండీస్‌ను ఓడించి భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ వేదికగా భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.