రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Wait 5 sec.

తెలంగాణలో 25 వేల మంది ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా బోగస్ ఉద్యోగులుగా ఇంతకాలం జీతాలు తీసుకున్నారని తెలిపారు. బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాటన్నింటిపైనా ఆడిట్ చేయించి ఆర్థిక శాఖ అధికారులు కేసులు నమోదు చేయాలని సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు 'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ' కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శాఖల వారీగా 10 వారాల పాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలని సీఎం అధికారులకు సూచించారు.మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే, ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్, ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి దరఖాస్తులన్నీ గడువులోగా పరిష్కరించాలన్నారు. అక్రమాలు జరిగితే వెంటనే గుర్తించాలని... ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలుండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.