తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా.. క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. క్యూర్- ప్యూర్‌ రీజియన్ల మధ్యలో గ్రీన్‌ బెల్ట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని పరిధిలో అందుబాటులోకి వచ్చే లక్షా పది వేల ఎకరాల భూముల్లో చెరువులతో పాటు ఆక్వా కల్చర్, అగ్రి బిజినెస్‌ వంటి వ్యాపారాలను చేయవచ్చు. ఈ భూములను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కానీ.. ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా గానీ గ్రీనరీని పెంపొందించి ఆర్‌ఆర్‌ఆర్‌ లోపల భాగంలో సకాలంలో వర్షాలు కురిసేలా చర్యలు తీసుకోనున్నారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ ప్రస్తుతం అంతగా గ్రీన్‌బెల్ట్‌ లేకపోవడం, ఇండ్లు, పరిశ్రమలు పెరుగుతుండడంతో కాలుష్యం పెరుగుతుందని చెబుతున్నారు. ఓఆర్‌ఆర్‌- ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలో గ్రీన్‌బెల్ట్‌ వల్ల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డు మధ్య 110 ప్రాంతాలను హరిత జోన్లుగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రీన్‌బెల్ట్‌కు కేటాయించనున్న 1.10లక్షల ఎకరాలను 110 గ్రీన్‌జోన్లుగా విభజించనున్నారు. ఇలా విభజిస్తే.. ప్రతి 3.5 కిలోమీటర్లకు ఒక హరిత జోన్‌ ఏర్పాటు కానుంది. ఇందులో ఆక్వా, అగ్రి బిజినెస్, చెట్లతో ప్రతి జోన్‌ ప్రాణవాయువు కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక రీజినల్ రింగు రోడ్డును రూ. 35 వేల కోట్ల వ్యయంతో 340 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్నారు. 24 అర్బన్‌ క్లస్టర్లు, 208 గ్రామాలను కనెక్ట్ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ పరిధిలో 182 కి.మీ గ్రీన్‌ఫీల్డ్‌ రింగ్‌రోడ్డు ప్రధాన రహదారిగా మారనుంది. ఔటర్ రింగు రోడ్డుతో పాటు చౌటుప్పల్, శివన్నగూడ, కందుకూరు, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్‌పల్లి, సంగారెడ్డి మీదుగా వెళ్లనుంది. ఉత్తర తెలంగాణ పరిధిలో 158 కి. మీ మేర ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వద్ద ఈ రోడ్డు కలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.