హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను ఇటీవలె మూడు కార్పొరేషన్లుగా విభజించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్.. అప్పుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బల్దియాకు ఉన్న అప్పులను టేకోవర్‌ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. జీహెచ్ఎంసీకి రూ.4,780 కోట్ల అప్పులు ఉండగా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని చెల్లించేందుకు కసరత్తులు చేస్తోంది. 3 కార్పొరేషన్లుగా విడిపోవడంతో.. అప్పులను ఎలా విభజించాలి అనే దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లకు జీహెచ్ఎంసీ చేసిన అప్పులను పంచితే.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని టాస్క్‌ఫోర్స్ కమిటీ తేల్చినట్లు సమాచారం. అందుకే ఆ అప్పులన్నింటికీ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.హైదరాబాద్ నగరం రోజురోజుకూ భారీగా విస్తరిస్తుండటంతో పెరిగిన అవసరాల మేరకు మౌలిక వసతులను కల్పించడంలో గత కొంత కాలంగా జీహెచ్ఎంసీకి తలకు మించిన భారంగా మారింది. మరీ ముఖ్యంగా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాతి నుంచి హైదరాబాద్ మహా నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే చాలా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, కొత్త డ్రైనేజీ నాలాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సుమారు రూ.7 వేల కోట్ల వరకు రుణాలు తీసుకుంది. ఈ రూ.7000 కోట్ల అప్పులపై గత 2 ఏళ్లుగా ప్రతీ నెల జీహెచ్ఎంసీ దాదాపుగా రూ. 100 కోట్ల వరకు వడ్డీలను చెల్లిస్తూ.. తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తోంది. ఆ అప్పులు వాటికి వడ్డీలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన పలు నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అప్పులను బల్దియాలోని కొత్త కార్పొరేషన్లకు పంచడం కంటే.. రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టేకోవర్ చేసి వాటిపై ఆర్థిక భారం లేకుండా చూడాలని సంబంధిత అధికారులు రేవంత్ రెడ్డి సర్కార్‌కు సూచించినట్లు తెలుస్తోంది.