ఆమనగల్లు ఉత్సవాల్లో తొక్కిసలాట.. అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. 10 మందికి తీవ్ర గాయాలు

Wait 5 sec.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. మహా శివరాత్రి ఉత్సవాల తర్వాత నిర్వహించే పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు పడి గాయాలపాలయ్యారు. అగ్నిగుండంలో నుంచి నడిచేందుకు పెద్ద మొత్తంలో భక్తులు ఒక్కసారిగా ఎగపడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ ఘటనలో సుమారు పది మంది భక్తులు తీవ్ర గాయాల పాలయ్యాయి.మహా శివరాత్రి తర్వాత పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణంలో భాగంగా బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో అగ్నిగుండం దాటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోవడంతో.. వెనకన ఉన్నవారు ఒక్కసారిగా ముందు ఉన్నవారిని తోయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు నెట్టుకోవడంతో అగ్నిగుండం దాటే వారు కంట్రోల్ తప్పి నిప్పుల్లో పడిపోయారు.ఈ తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, స్థానికులు స్పందించారు. నిప్పుల్లో పడిన భక్తులను హుటాహుటిన బయటికి తీసి కాపాడారు. పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించడంతో భక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 10 మంది భక్తులు నిప్పుల్లో పడి గాయాల పాలు కావడంతో.. వారిని హుటాహుటిన చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్లు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. దేవుడి అనుగ్రహం కోసం వెళ్లిన భక్తులకు ఇలాంటి ప్రమాదం జరగడంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన విషయం తెలియడంతో.. స్థానిక అధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి.. ఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాల్లో సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.