రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్.. సమగ్రంగా అధ్యయనం చేసి.. తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవలె నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదిక తప్పుల తడకగా ఉందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో తెలంగాణలో ఈ విద్యా కమిషన్ రిపోర్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు .. విద్యా కమిషన్ రిపోర్టుపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల జీతాలను తగ్గించాలని విద్యా కమిషన్ రిపోర్టు ఇచ్చిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.తెలిసి తెలియక విద్యా కమిషన్‍పై రిపోర్టుపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయని కే కేశవరావు తెలిపారు. చాలా మందిని కలిసి చర్చించిన తర్వాతే విద్యా కమిషన్ రిపోర్టును తయారు చేసినట్లు వెల్లడించారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికను త్వరలోనే రాష్ట్రంలో అమలు చేస్తామని కే కేశవరావు స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కే కేశవరావు.. విద్యా కమిషన్ నివేదికపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల జీతాలపై లేనిపోని వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమాజంలోని విద్యార్థులు దారి తప్పకుండా వారికి విద్యా బుద్ధులు నేర్పి గొప్ప గొప్ప వాళ్లుగా తీర్చిదిద్ది ప్రయోజకులను చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు వెల కట్టలేనివి అని కే కేశవరావు అభివర్ణించారు. ఉపాధ్యాయుల జీతాల అంశాన్ని ప్రతిపక్ష నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలు ఉన్నారా.. స్కూల్‌, కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో బేసిక్‌ బోధన చేసిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరైనా ఉన్నారని చెప్పగలరా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఈ సందర్భంగా కే కేశవరావు తీవ్రంగా ఖండించారు. కమిషన్‌లో విద్యావేత్తలు ఎందుకు లేరని ప్రతిపక్షాలను నిలదీశారు.అయితే ఇటీవల ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ రేవంత్ రెడ్డి సర్కార్‌కు రిపోర్టు సమర్పిస్తూ.. పలు సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సుల్లో ప్రభుత్వ టీచర్లు, అధ్యాపకుల జీతాలకు సంబంధించి చేసిన అంశం తీవ్ర వివాదానికి కారణం అయింది. టీచర్లు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్‌లకు అధిక వేతనాలు ఉన్నాయని.. ఈ జీతాలను రానున్న రోజుల్లో హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని.. విద్యా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులపై ప్రతిపక్షాలు.. ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల జీతాల అంశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కే కేశవరావు క్లారిటీ ఇచ్చారు.