Date: భారత స్టాక్ మార్కెట్లో 2026 ఏడాదిలో పలు ప్రముఖ కంపెనీల నుంచి ఐపీఓలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖంగా రిలయన్స్ జియో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఓయో, జెప్టో, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే వంటివి ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ఇండియన్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం ఫోన్‌పే తన ఐపీఓ ప్రాసెస్‌ను వేగవంతం చేసింది. ఈ కంపెనీ విలువను సుమారు 9 బిలియన్ డాలర్ల నుంచి 10.5 బిలియన్ డాలర్ల వరకు పరిగణించాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారం గురించి నేరుగా తెలిసిన ఇద్దరు వ్యక్తుల్ని ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 82000- 96000 కోట్ల మధ్య ఉంటుంది. ఈ విలువ వద్ద 900 మిలియన్ డాలర్ల నుంచి 1.05 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని భావిస్తోంది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 8293 కోట్ల నుంచి రూ. 9675 కోట్ల వరకు ఉంటుంది. 2023లో ప్రైవేట్ మార్కెట్‌లో ఏకంగా 12 బిలియన్ డాలర్ల విలువ వద్ద (రూ. 1.10 లక్షల కోట్లు) 100 మిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించింది. విలువ అప్పటితో పోలిస్తే ఇంకా తక్కువగా ఉండటం గమనార్హం. ఐపీఓ కోసం వాల్‌మార్ట్.. ఫోన్‌పేలోని తన వాటాను గణనీయంగా తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. సుమారు 12 శాతం వరకు వాటా విక్రయించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల . సంస్థ ఐపీఓ ఫైలింగ్ ప్రకారం.. ప్రమోటర్లుగా ఉన్న వాల్‌మార్ట్ సహా టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఫైనాన్స్ కూడా పెద్ద మొత్తంలో ఐపీఓ కోసం షేర్లను విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 3 సంస్థలు కలిసి సుమారు 50.7 మిలియన్ షేర్లను (సుమారు 57 కోట్లు) విక్రయించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే ఉండనుంది. అదనంగా ఎలాంటి షేర్లను అందుబాటులోకి తీసుకురావట్లేదు. ఫోన్‌పే.. ప్రస్తుత భారత యూపీఐ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తుంది. మెజార్టీ వాటా దీనిదే కావడం విశేషం. ఇది గూగుల్ పే, పేటీఎంకు గట్టి పోటీ ఇస్తోంది. గత సెప్టెంబరులోనే ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏప్రిల్‌ వరకు పూర్తి చేయాలని చూస్తోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కాస్త వాయిదా పడే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పేటీఎం తర్వాత ఇప్పుడు ఫోన్‌పే భారత రెండో అతిపెద్ద ఫిన్‌టెక్ ఐపీఓగా అవతరించనుంది. 2021లో పేటీఎం దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువతో లిస్టయింది. అప్పటి విలువ ప్రకారం ఇది రూ. 1.40 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత విలువ మాత్రం రూ. 65 వేల కోట్లుగానే ఉంది.