యుద్ధం దెబ్బకు మార్కెట్లు ఢమాల్.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి.. సెన్సెక్స్ 1100 పాయింట్లు డౌన్

Wait 5 sec.

Market Crash: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలో భారీగా పడిపోతున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడి అయిన హార్ముజ్ జల సంధిని ఇరాక్ మూసి వేసిన కారణమంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. అలాగే తాజా ఉద్రిక్తత కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దీనికి తోడు విదేశీ మదుపరులు భారీగా అమ్మకాలు చేపట్టడం, రుపాయి విలువ భారీగా పడిపోవడం వంటివి మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు మార్కెట్లు ముగిసే నాటికి 1100 పాయింట్ల నష్టంతో ముగిసింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల విలువ ఏకంగా రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దీంతో కంపెనీల మొత్తం విలువ రూ.456 లక్షల కోట్ల వద్దకు పడిపోయింది. మార్చి 4వ తేదీ స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఉదయం 78,528 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఇంట్రాడేలో 78,443 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1122,66 పాయింట్ల నష్టంతో 79,116 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైత 385 పాయింట్లు కోల్పోయి24,480 వద్దకు పడిపోయింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా మినహా మిగిలిన షేర్లన్నీ నష్టపోయాయి. టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 82 డాలర్లకు చేరింది. ఇక బంగారం ఔన్స్ 5185 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ఐదో రోజుకు చేరుకున్నాయి. తాజాగా టెహ్రాన్, బీరుట్ పై దాడులు జరిగాయి. మరో నాలుగైదు వారాల పాటు యుద్ధ కొనసాగవచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అంతకు మించి కొనసాగినా అందుకు సిద్ధమని పేర్కొన్నారు. దీంతో యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82 డాలర్లు దాటింది. భారత చమురు అవసరాలు 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరగడంతో కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. దీంతో వృద్ధిపై భయాలు నెలకొన్నాయి.