తెలంగాణ శాసనసభ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులను తీసుకురానుంది. దీనిలో భాగంగా మార్చి 8వ తేదీన కొత్తగా నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను ప్రారంభించనున్నారు. కౌన్సిల్ హాల్ ప్రారంభించే అదే రోజున అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, గౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.వీటితోపాటు అసెంబ్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఛాంబర్‌, శాసనమండలి ఛైర్మన్ ఛాంబర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే రోజున ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక ఈ కొత్త నిర్మాణాలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఈసారి జరగనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ఒకే ప్రాంగణంలోని అసెంబ్లీ, కొత్త కౌన్సిల్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఒకే ప్రాంగణంలో అటు అసెంబ్లీ, ఇటు మండలి కార్యకలాపాలు జరగడం వల్ల పాలనపరంగా పనులు మరింత సులభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ఇక మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మార్చి 20న రంజాన్ పండగ రోజున సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16న గవర్నర్ ప్రసంగం.. మార్చి 17, 18ల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 2026-2027 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను మార్చి 20న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభ ముందుకు తీసుకురానున్నారు.