ఏపీకి వచ్చిన పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారా.. ఆ నాలుగు కంపెనీలపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కు వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 'ఏపీలో పెట్టుబడులు పెట్టలేం కూటమి రౌడీలకు నెలవారి మామూళ్ళు ఇవ్వలేం అంటూ పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోతున్నారు. తమకు కేటాయించిన భూములను సైతం తిరస్కరించి పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి వెళ్ళిపోతున్నారు' అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌లు, పోస్టులు పెడుతున్నారు. ఓ నాలుగు కంపెనీలు ఏపీ నుంచి వెనక్కు వెళ్లిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఆ నాలుగు కంపెనీలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. 'పెట్టేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. వాస్తవాలకు భిన్నంగా కేవలం అపోహలకు మాత్రమే తావిచ్చేలాగా వారు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. 2024 జూన్ నుంచి APIIC నుంచి 69 పెద్ద పరిశ్రమలకు భూములు కేటాయించడమైనది. రూ.3.88 లక్షల కోట్ల పెట్టుబడితో, మొత్తం 1.82 లక్షల ఉద్యోగాల కల్పన చేసే సామర్ధ్యం ఉన్న కంపెనీలు ఇవి. APIIC స్థాపించిన నాటి నుంచి 25,231 పరిశ్రమలకు భూములు కేటాయిస్తే అందులో 3,584 పరిశ్రమలకు వివిధ కారణాలతో భూముల కేటాయింపు రద్దు చేసి భూములు వాపసు తీసుకోవడం జరిగింది. భూములు వాపసు తీసుకోవడానికి పలు రకాల కారణాలు ఉంటాయి. 2019- 24 మధ్య కాలంలో ఇలా భూములు వాపసు తీసుకున్న కంపెనీలు 8 వరకూ ఉన్నాయి' అని తెలిపారు.'APIIC నుంచి భూములు తీసుకున్న కంపెనీలు తాము ఇచ్చిన నిర్మాణ, కంపెనీ ప్రారంభ షెడ్యూలు కు కట్టుబడి ఉండాలి. దీని కోసం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ వివిధ స్థాయిలలో పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశాలలో ఈ ప్రోగ్రెస్ రిపోర్టులపై చర్చ జరుగుతుంది. మొత్తం APIIC చేసిన 69 భూ కేటాయింపులలో కేవలం 4 మాత్రమే ఇప్పుడు రద్దు అయ్యాయి. అదీ కూడా ఆయా కంపెనీల వారు నిర్దేశించిన సూత్రాలకు కట్టుబడి ఉండకపోవడం వల్లే జరిగింది. ఈ భూములను తక్షణమే పెట్టుబడులు పెట్టే వారికి బదలాయించడం జరుగుతుంది' అంటూ వివరించారు.'హిందూస్థాన్ కోకా కోలా బెవరేజెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 50.03 ఎకరాలు కేటాయించగా వారు పలు కారణాల వల్ల ముందుకు వెళ్లలేకపోవడంతో భూ కేటాయింపు రద్దు చేయడమైనది. తమ పెట్టుబడులను వారు విజయనగరంలో ఏర్పాటు చేస్తున్న JSW Park కు తరలిస్తున్నారు. GINFRA ప్రిసిషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో 121.53 ఎకరాలు కేటాయించగా వివిధ అంతర్గత కారణాలతో వారు ముందుకు వెళ్లలేకపోయారు. దాంతో ఆ భూమిని అంతరిక్ష, రక్షణ రంగ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు బదలాయించడం జరిగింది. ఆజాద్ ఇండియా మొబిలిటీ వారికి శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లిలో 36 ఎకరాలు కేటాయించగా వారు ఈఎండి మినహా భూ విలువను కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. దాంతో వారి భూ కేటాయింపు రద్దు చేసి APIICతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈఎండి నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈఎండి కి ఎలాంటి వడ్డి చెల్లించడం లేదు' అన్నారు.'జూపిటర్ రెన్యువబుల్ ఎనర్జీ వారికి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 67 ఎకరాలు కేటాయించగా వారు తమ రెండో దశ విస్తరణకు అక్కడ అవకాశం లేనందున ప్రత్యామ్నాయ స్థలం కావాలని కోరడంతో కేటాయింపును రద్దు చేసి ప్రత్యామ్నాయ భూమి కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నది. మిథాని నాల్కో వారు నెల్లూరు లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారనే దాంట్లో కూడా వాస్తవం లేదు. తమ జాయింట్ వెంచర్ కంపెనీ అయిన ఉత్కర్ష అల్యూమీనియం ధాతు నిగం ద్వారా వారు ముందుగా ఒప్పందం చేసుకున్న ఉత్పత్తులు కాకుండా వేరేవి చేయాలని భావిస్తున్నందున డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సమర్పించాల్సి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున ప్రభుత్వ పరంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే తప్పుడు సమాచారంతో ప్రజలను తికమక పెట్టాలని చూడడం నేరపూరిత చర్య' అని తెలిపింది.