బస్సు ప్రయాణికులకు తీపి కబురు.. TGSRTCకి కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు

Wait 5 sec.

తెలంగాణలోని బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలోనే రద్దీ కష్టాలు తీరిపోనున్నాయి. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ఫ్రీ జర్నీ కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగటంతో బస్సుల్లో జాగా ఉండటం లేదు. నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీకి కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా కోసం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌-ఈవీ ట్రాన్స్, గ్రీన్‌సెల్‌ మొబిలిటీ సంస్థల్ని ఎంపిక చేసింది. వీటి ద్వారా 2 వేల బస్సులను సరఫరా చేయాలని కోరుతూ లెటర్‌ ఆఫ్‌ అవార్డు ఫైల్‌పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సంతకాలు చేశారు. సదరు సంస్థలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లింపు, అగ్రిమెంటు ప్రక్రియ తర్వాత బస్సుల తయారీ మొదలుకానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 2027 ఆగస్టు మధ్యకాలంలో ఈ కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో పీఎం ఈ-డ్రైవ్‌ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం 2 వేల మంజూరుచేసింది. అందులో 1,025 లోఫ్లోర్‌ నాన్‌ ఏసీ బస్సులు కాగా.. 60 లోఫ్లోర్‌ ఏసీ బస్సులు. ఈ బస్సుల తయారీ టెండరు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌-ఈవీ ట్రాన్స్‌కు ఇచ్చారు. 915 స్టాండర్డ్‌ ఫ్లోర్‌ బస్సుల తయారీ టెండరు గ్రీన్‌సెల్‌ మొబిలిటీ దక్కించుకుంది. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ ఏరియాల్లో నడిపేందుకు స్టాండర్డ్‌ ఫ్లోర్‌ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ఏడాది అక్టోబరు 1 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో తిరిగే బస్సులు లో ఫ్లోరే ఉండాలంటూ కేంద్రం ఇటీవల ఓ సర్కులర్‌ జారీచేసింది. దీనిపై స్పష్టత కోసం కేంద్రానికి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఇటీవల లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే తుది నిర్ణయం ప్రకారమే కొత్త బస్సుల్ని సరఫరా చేయాలని గ్రీన్‌సెల్‌ మొబిలిటీకి షరతు విధించినట్లు ఆర్టీసీ వర్గాల ద్వారా తెలిసింది. కేంద్రం సాండర్డ్‌ ఫ్లోర్‌కు అంగీకరించకపోతే 915 బస్సుల్ని లోఫ్లోర్‌గానే తయారుచేసి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మెుత్తంగా రానున్న ఏడాది కాలంలో తెలంగాణ ఆర్టీసీకి 2 వేల కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి.